Site icon Prime9

AAP Candidate List: అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి వ్యూహాలు.. 11 మంది అభ్యర్థులతో ఆప్ తొలిజాబితా

AAP releases first list for Delhi assembly election 2025: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు పెంచింది. మిగిలిన అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థుల ప్రకటనకు ఆప్ సిద్దమైంది. ఈ క్రమంలో  11 మంది అభ్యర్థులు పేర్లను ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. త్వరలోనే మిగిలిన స్థానాలకూ అభ్యర్థులను ప్రకటిస్తారని, ఢిల్లీ ప్రజలు తిరిగి తమకు అండగా నిలవబోతున్నారని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.

కొత్త వ్యూహంతో వచ్చిన కేజ్రీ
ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ అరెస్ట్, సీఎం పదవి నుంచి వైదొలగటం, పలువురు సీనియర్ నేతలు వివాదాల్లో చిక్కుకుపోవటం, సీఎంగా అతిషి బాధ్యతలు స్వీకరించటం, సీనియర్ నేత కైలాష్ గెహ్లోత్ పార్టీని వీడటం వంటి పరిణామాలతో కుదుపునకు గురైన ఆప్ పార్టీ, రాబోయే ఎన్నికలను సవాలుగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించకపోతే ఇక తమ పార్టీ మనుగడే ఉండదని ఆప్ అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ దూకుడుకు అడ్డుకట్టవేసేలా ఆయన ఎన్నికల వ్యూహాన్ని రూపొందించారు. అందులో భాగంగానే బీజేపీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆరుగురు నేతలను తమ అభ్యర్థులుగా ప్రకటించారు.

అభ్యర్థులు వీరే..
కేజ్రీవాల్ ప్రకటించిన 11 మందిలో బ్ర‌హ్మ సింగ్ త‌న్వార్‌, అనిల్ జా, బీబీ త్యాగిలకు చోటు లభించింది. వీరంతా బీజేపీ నుంచి ఆప్‌లో చేరిన నేతలే. ఇక, ఈ జాబితాలోని జుబైర్ చౌద‌రీ, వీర్ సింగ్ దింగ‌న్‌, సోమేశ్ షోకీన్‌లు కాంగ్రెస్ నుంచి ఆప్‌ తీర్థం పుచ్చుకున్నారు. వీరుగాక ఈ జాబితాలో పార్టీకి విధేయులైన మాజీ ఎమ్మెల్యే సరితా సింగ్ (రోహ్తాస్ నగర్), మాజీ ఎమ్మెల్యే రామ్ సింగ్ నేతాజీ (బదర్‌పూర్), దీపక్ సింఘాల్ (విశ్వాస్ నగర్)లకు చోటు దక్కింది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా, 2020 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆప్ 62 స్థానాలు సాధించిన సంగతి తెలిసిందే.

Exit mobile version