Mysuru polling Booth: మన దేశంలో ఎన్నికలంటే పండుగ వాతావరణాన్ని తలపిస్తాయి. ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీ ప్రకటించిన వెంటనే చిన్న గ్రామాల నుంచి అతి పెద్ద నగరాల వరకు ఎన్నికల సందడి మొదలవుతుంది. రాజకీయ పార్టీల కార్యకర్తల హడావుడికి అంతే ఉండదు. బ్యానర్లతో , లౌడ్ స్పీకర్లతో ప్రచారాన్ని హోరెత్తిస్తుంటారు. ప్రస్తుతం మన దేశంలో రెండో దశ పోలింగ్ ముగిసింది. శుక్రవారం నాడు కర్ణాటకలో పోలింగ్ జరిగింది. అయితే ఇతర పోలింగ్ స్టేషన్‌లకు భిన్నంగా మైసూర్ పోలింగ్ బూత్ అందరిని ఆకర్షించింది.
ఈ పోలింగ్ బూత్‌ను చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో పెళ్లి మంటపంలా తయారు చేశారు. ఎన్నికల అధికారులు కూడా పెళ్లి సందర్బంగా వేసుకొనే సంప్రదాయబద్దమైన దుస్తులు ధరించారు. ఇక పోలింగ్ బూత్‌లోకి వెళ్లే ఎంట్రెన్స్ వద్ద గుమ్మాలకు పెద్ద పెద్ద అరటి గెలలతో అలంకరించారు. సాధారణంగా దక్షిణాదిన వివాహ మంటపాలకు ఇలా అరటాకులు.. అరటి గెలలతో అలంకరించడం తరతరాలుగా మన దేశంలో వస్తున్న సంప్రదాయం.ఎన్నికల అధికారులు కూడా దక్షిణాది రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందర్బంగా ధరించే వినూత్నమైన దస్తులు ధరించి విధులకు హాజరయ్యారు. తెల్లటి ధోతితో పాటు కుర్తా, తలపాగా ధరించి విధులు నిర్వహించారు. వీరు ఎన్నికల అధికారుల మాదిరాగా కాకుండా పెళ్లి వేడుకల సందర్బంగా పెళ్లి పెద్దలు అతిథులను ఆహ్వానించినట్లు ఓటర్లను ఆహ్వానించారు. పోలింగ్ బూత్‌ను గుర్తుపట్టలేని విధంగా పెళ్లిమంటపంలా తయారు చేశారు. పోలింగ్ బూత్ గోడలపై ప్రవేశ ద్వారం దగ్గర పెద్ద పెద్ద అక్షరాలతో అందరం కలిపి ప్రజాస్వామ్యం పండుగను జరుపుకుందాం. తప్పకుండా వచ్చి మీ ఓటును సద్వినియోగం చేసుకోండంటూ గోడలపై రాతలు రాశారు. కాగా రెండవ విడత పోలింగ్ సందర్భంగా కర్ణాటకలో మొత్తం 28 నియోజకవర్గాలకు గాను 14 నియోజకవర్గాల్లో శుక్రవారం పోలింగ్ జరిగింది. మిగిలిన 14 నియోజకవర్గాల్లో మే 7న పోలింగ్ జరుగనుంది.