Naga Chaitanya and Sobhita Dhulipala at IFFI: కాబోయే భార్య శోభిత ధూళిపాళతో అక్కినేని హీరో నాగచైతన్య గోవాలో సందడి చేశాడు. ఇఫీ వేడుకలో భాగంగా వీరిద్దరు జంటగా పాల్గొన్నారు. అంతేకాదు అక్కినేని కుటుంబం కూడా ఈ కార్యక్రమానికి హాజరైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో గోవాలోని పనాజీ వేదికగా 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI) వేడుకలు ఘనంగా ప్రారంభయ్యాయి. 8 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి భారత చలన చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్స్ అంతా పాల్గొననున్నారు. ఈసారి ఈ ఇఫీ వేడుకలకు తెలుగువారికి చాలా ప్రత్యేకం కానుంది.
ఎందుకంటే ఈ ఈవెంట్‌లో తెలుగు అక్కినేని నాగేశ్వరరావుకు నివాళులు అర్పిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖులు నటులు శతజయంతి వేడుకల సందర్భంగా వారికి ఈ ఇఫీ వేదికగా నివాళులు అర్పించనున్నారు. ఇటీవల అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి జరిగిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు దివంగత నటులు రాజ్ కపూర్, గాయకుడు మహమ్మద్ రఫీ, బెంగాలి దర్శకుడు తపన్‌సిన్హాకు నివాళులు అర్పించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కినేని నాగేశ్వరరావు నివాళులు అర్పిస్తున్న క్రమంలో అక్కినేని ఫ్యామిలీ ఈ కార్యక్రమానికి హాజరైంది.
నాగర్జున అక్కినేని, ఆయన భార్య అమల, సుశాంత్, నాగచైతన్య, శోభితతో పాటు మరికొందరు అక్కినేని ఫ్యామిలీ సభ్యులు హాజరై ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణ నిలిచారు. ముఖ్యంగా కాబోయే జంట నాగచైతన్య-శోభితలు రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. జంటగా ఫోటోలకు ఫోజులు ఇచ్చి అందరి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా త్వరలోనే నాగచైతన్య-శోభితలు పెళ్లి బంధంలోకి అడుగుపట్టబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో వీరి పెళ్లి జరగనుందని సమాచారం. ప్రస్తుతం వీరి పెళ్లి అంశం హాట్‌టాపిక్‌గా ఉన్న తరుణంలో ఈ జంటగా ఇలా ఈఫీ వేడుకలో మెరవడంతో అక్కినేని ఫ్యాన్స్ అంతా తెగ ముచ్చటపడిపోతున్నారు.
కొంతకాలంగా సీక్రెట్ రిలేషన్‌లో ఉన్న వీరు సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకుని అందరికి షాకిచ్చారు. ఆగష్టు 8వ తేదిన వీరిద్దరు రింగులు మార్చుకున్న సంగతి తెలిసిందే. ఎంగేజ్‌మెంట్ అనంతరం నాగార్జున ఫోటోలు షేర్ చేసి అధికారిక ప్రకటన ఇచ్చారు. ఇవి చూసి అంతా షాక్ అయ్యారు. అప్పటి నుంచి చై-శోభితల పెళ్లి ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. కాగా గతంలో నాగచైతన్య స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్లు అన్యోన్యంగా ఉన్న ఈ జంట 2021లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగచైతన్య తండేల్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కితున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ని జరుపుకుంటుంది. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. నిజ జీవిత సంఘటన ఆధారం ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తండేల్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల కానుంది.