Indian Railway Hikes Ticket Price: ప్రయాణికులు షాక్.. జూలై 1 నుంచి రైలు ఛార్జీలు పెంపు?

Indian Railway Hikes Ticket Price from July 1st: దేశంలో రవాణా రంగంలో రైల్వేలది కీలకమైన పాత్ర. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు రైల్వేలు ఎంతో ఉపకరిస్తాయి. సామాన్య ప్రజల నుంచి సంపన్నుల వరకు రైల్వేలను ఆశ్రయిస్తుంటారు. తక్కువ ఖర్చులో ప్రయాణం చేయొచ్చని అనుకుంటున్న ప్రజలకు ఛార్జీల భారాన్ని మోపాలని ఇండియన్ రైల్వేస్ అనుకుంటుందట.
చాలా ఏళ్లుగా ఇండియన్ రైల్వేస్ ప్యాసింజర్ రైళ్ల టికెట్ ధరలను పెంచలేదు. తాజాగా జూలై 1 నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి వస్తాయని వార్తలు వస్తున్నాయి. నాన్ ఏసీ మెయిల్/ ఎక్స్ ప్రెస్ రైళ్ల ప్రయాణికుల ఛార్జీలు కిలోమీటరుకు 1 పైసా చొప్పున, ఏసీ క్లాస్ ఛార్జీలు కిలోమీటరుకు 2 పైసలు చొప్పున పెరగనున్నట్టు సమాచారం.
ఇక 500 కిలోమీటర్ల ప్రయాణానికి సబర్బన్ టికెట్లు, రెండో తరగతి ప్రయాణానికి ఛార్జీల పెంపు ఉండదని తెలుస్తోంది. 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఛార్జీల పెంపు కిలోమీటర్ కు 0.5 పైసా చొప్పున ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇక నెలవారీ సీజనల్ టికెట్ విషయంలో ఎలాంటి పెంపు ఉండబోదని టాక్. అయితే దీనిపై భారతీయ రైల్వేలు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన జారీచేయలేదు.