Last Updated:

Chicken Price Dropped: భారీగా తగ్గిన చికెన్ ధరలు.. బర్డ్ ఫ్లూ భయమే కారణమా..?

Chicken Price Dropped: భారీగా తగ్గిన చికెన్ ధరలు.. బర్డ్ ఫ్లూ భయమే కారణమా..?

Huge drop in Chicken Price due to Bird Flu Effect in Telugu States:  ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం నెలకొంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో లక్షలాది సంఖ్యలో కోళ్లు మృతి చెందగా.. మరిన్ని కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. అయితే ఈ ప్రభావం తెలంగాణలోనూ వ్యాపిస్తోంది. అయితే బర్డ్ ఫ్లూ భయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు. దీంతో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. మరోవైపు ఏపీ నుంచి తెలంగాణకు కోళ్లు రాకుండా పలువురు అడ్డుకుంటున్నారు.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కోళ్లకు వ్యాపిస్తున్న వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, హైదరాబాద్ నగరంలో సాధారణంగా రోజుకు 6 లక్షల కేజీల చికెన్ విక్రయాలు జరగుతుండగా.. గత రెండు రోజులుగా చికెన్ విక్రయాలు భారీగా పడిపోయాయి. దీంతో కేజీ చికెన్ ధర రూ. 150కి పడిపోయింది.

అయితే ఏపీలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోతున్నాయి. కోళ్లకు వైరస్ వ్యాపిస్తుండడంతోనే చనిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ బర్డ్ ఫ్లూ రెండు రాష్ట్రాలకు వ్యాపించినట్లు గుర్తించారు. అందుకే ఇతర ప్రాంతాలను నుంచి కోళ్లు రాకుండా రాష్ట్ర సరిహద్దుల్లో దాదాపు 24 చెక్‌పోస్టులు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఇదిలా ఉండగా, ఈ బర్డ్ ఫ్లూ వైరస్‌పై అంతటా చర్చ జరుగుతోంది. అయితే అసలు ఈ వైరస్ ఎలా వస్తుందనే విషయాన్ని పలువురు వెతుకుతున్నారు. బర్డ్ ఫ్లూ పక్షుల్లో H5N1 వైరస్ కారణంగా వచ్చే అంటువ్యాధి అన్నారు. తొలుత ఈ వైరస్ 1996లో చైనాలో ఉద్భవించిందని తెలిసింది.

వైరస్ సోకిన పక్షుల శ్వాసకోశ స్రావాలు, రక్తంతో వ్యాప్తి చెందుతుందని పలువురు చెబుతున్నారు. 1997 నుంచి 2004 మధ్య కాలంలో దాదాపు 954 మందికి సోకగా.. 464 మంది చనిపోయారన్నారు. అయితే మనిషి నుంచి మనిషికి ఈ వ్యాధి వ్యాపిస్తుందని తెలియజేసేందుకు ఆధారాలు లభించలేదన్నారు. వైరస్ సోకిన పక్షులతో సమయం కేటాయించిన లేదా కోళ్ల ఫారాల్లో పనిచేసే కార్మికులు బర్డ్ ఫ్లూ వైరస్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.