MLC Kavitha: ఈడీ నోటీసులపై రియాక్ట్ అయిన కవిత.. కేసీఆర్ ను ఎవరూ లొంగదీసుకోలేరంటూ కామెంట్

ఢిల్లీ మద్యం కేసులో ఈడీ నోటీసులు ఇవ్వడంపై కవిత స్పందించారు.

MLC Kavitha: ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ నోటీసులు జారీ చేసింది. విచారణ నిమిత్తం మార్చి 9 న ఢిల్లీకి రావాలంటూ కవితకు పంపిన నోటీసుల్లో పేర్కొంది ఈడీ. ఈ క్రమంలో ఈడీ నోటీసులు ఇవ్వడంపై కవిత స్పందించారు.

 

దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరిస్తా(MLC Kavitha)

‘రాజకీయ రంగంలో తగిన ప్రాతినధ్యం కల్పించడానికి ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.

ఈ క్రమంలో మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 10 న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షకు తలపెట్టాం.

ఈ నేపథ్యంలో మార్చి 9 న ఢిల్లీలోని విచారణకు రావాల్సిందిగా నాకు నోటీసులు జారీ చేసింది.

చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరిస్తాను. కానీ ముందుగా ఫిక్స్ అయిన కార్యక్రమాల దృష్ట్యా విచారణకు వెళ్లే తేదీపై న్యాయవాదుల సలహా తీసుకుంటున్నాను.

కేసీఆర్, భారాసాను లొంగదీసుకోవడం ఎవరి వల్ల కాదు.. ఈ విషయం బీజేపీ తెలుసుకోవాలి. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తాం.

బీజేపీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం’ అని కవిత ట్వీట్ చేశారు.

 

 

అరుణ్ పిళ్లై  నుంచి కీలక విషయాలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరుణ్ పిళ్లైని అరెస్ట్ చేసిన ఈడీ.. ఆయన నుంచి కీలక వివరాలు రాబట్టినట్లు సమాచారం అందుతుంది.

ఈ స్కామ్‌లో కవితకు సంబంధించిన కీలక వివరాలు పిళ్లై వెల్లడించాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.

ఇక, మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఈ నెల 10వ తేదీన ధర్నాకు దిగనున్నట్టుగా ఇటీవల కవిత ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతామని చెప్పారు. ఈ నిరసనలో ఇతర రాష్ట్రాలకు చెందిన వివిధ మహిళా సంఘాలు, నేతలు కూడా పాల్గొంటారని తెలిపారు.

 

బెదిరింపులకు భయపడను

అదే సమయంలో.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమెను అరెస్టు చేసే అవకాశంపై అడిగిన ప్రశ్నకు కవిత స్పందిస్తూ.. అలాంటి బెదిరింపులకు తాను భయపడనని చెప్పారు.

బీజేపీ నాయకులు చెబితే తనను అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. ఒకవేళ అలా చేస్తే అది మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుందని అన్నారు.

అరెస్ట్ గురించి దర్యాప్తు సంస్థ చెప్పాలి తప్ప బీజేపీ నేతలు కాదని అన్నారు. అయితే ఢిల్లీ కవిత ధర్నాకు ఒక్క రోజు ముందు విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈడీ నోటీసులకు, ఢిల్లీలో కవిత ధర్నాకు నేరుగా సంబంధం లేకున్నా.. ధర్నాపై మాత్రం ప్రభావం పడే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ఈడీ నోటీసులపై కవిత ఏ విధంగా స్పందిస్తారనేది వేచిచూడాల్సి ఉంది. ఒకవేళ కవిత రేపు ఈడీ విచారణకు హాజరైతే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అనే చర్చ సాగుతుంది.

కవితకు రామచంద్రపిళ్లై బినామీ అని, ఆమెకు లబ్ధి చేకూర్చేందుకు ఆయన అన్నీ తానై వ్యవహరించారని న్యాయస్థానానికి ఈడీ తెలిపింది.

అలాగే, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ. 100 కోట్ల ముడుపులు ముట్టజెప్పిన సౌత్‌గ్రూప్‌కు చెందిన ఇండోస్పిరిట్స్ సంస్థలో కవిత తరపున పిళ్లై భాగస్వామిగా ఉన్నారని పేర్కొంది.

ఈ నేపథ్యంలోనే కవితకు నోటీసులు జారీ చేశారు. పిళ్లైతో కలిపి ఆమెను విచారిస్తారని తెలుస్తోంది.

కాగా, ఇదే కేసులో గతేడాది డిసెంబరు 11న కవితను ఆమె ఇంటి వద్దే సీబీఐ అధికారులు విచారించారు.