Site icon Prime9

MLC Kavitha: ఆడబిడ్డకో న్యాయం.. అదానీకి మరో న్యాయమా?.. నోరువిప్పిన కవిత

MLC Kavitha Reacts On Adani Issue: సుదీర్ఘ మౌనం తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కె. కవిత మళ్లీ వార్తల్లోకి వచ్చారు. గురువారం అదానీకి న్యూయార్క్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయటంపై ఆమె ‘ఎక్స్’లో స్పందించారు. ధర్మానికి ప్రతీకగా తనను తాను భావించుకునే మోదీ పాలనలో ఆడబిడ్డకు, ప్రధాని మిత్రుడికి వేర్వేరు న్యాయాలుంటాయా? అని ఆమె నిలదీశారు. చాలారోజుల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాజకీయపరమైన ట్వీట్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభత్వాన్ని విమర్శిస్తూ సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీజేపీ, ప్రధాని మోడీపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

ఇదేనా మీ ధర్మపాలన?
దేశానికి సుపరిపాలన అందిస్తున్నామని చెప్పుకునే ప్రధాని మోదీ హయాంలో వ్యక్తుల స్థాయిని బట్టి న్యాయం ఉంటుందేమో అని ఆమె తన ట్వీట్‌లో అనుమానం వ్యక్తం చేశారు. ‘అఖండ భారతంలో అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా అని ప్రశ్నించారు క‌విత‌. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా అని క‌విత‌ ప్రధానిని ప్రశ్నించారు. ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా’ అని ఎక్స్‌లో ప్రశ్నించారు.

మళ్లీ రాజకీయాల్లోకి?
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఆరోపణల్లో కవిత తిహార్ జైలుకు వెళ్లటం, సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత గత ఆగస్టులో సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయటంతో ఆమె విడుదలైన సంగతి తెలిసిందే. తనను అన్యాయంగా జైల్లో పెట్టారని, త్వరలో దీనిపై వడ్డీతో సహా వారికి చెల్లిస్తానని కూడా కవిత విడుదలైన తర్వాత శపథం చేశారు. జైలు నుంచి వచ్చిన తర్వాత ‘సత్యమేవ జయతే’అంటూ ట్వీట్ చేసిన కవిత ఆ తర్వాత కుటుంబంతో గడుపుతూ రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఆమె రాజకీయాలపై ట్వీట్ చేయటంతో త్వరలోనే ఆమె పొలిటికల్ రీఎంట్రీకి రెడీ అవుతున్నారని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి.

Exit mobile version