Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించి రాధాకిషన్ స్టేట్‌మెంట్‌లో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. గతంలో బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్‌ను ప్రభాకర్ రావు ట్యాప్ చేశాడు. రోహిత్ రెడ్డితో పాటు మరికొందరు.. బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. పైలట్ రోహిత్ రెడ్డి ఆడియోలను ముందు పెట్టి.. ఎమ్మెల్యేల కొనుగోలుకు తెర దించారు.
పైలట్ రోహిత్ రెడ్డి స్కెచ్ ప్రకారం మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో చర్చలు జరిగాయి. మధ్యవర్తి నందు ఫోన్ ట్యాప్ చేయడంతో.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో.. బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేయాలని మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. బీఎల్ సంతోష్‌ను అడ్డం పెట్టుకుని.. లిక్కర్ స్కామ్ నుంచి కవితను తప్పించాలని ప్లాన్ చేశారు. బీఎల్ సంతోష్ అరెస్ట్ ప్రయత్నాలు విఫలం కావడంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు పెద్ద ఎత్తున స్పై కెమెరాలు.. డివైస్‌లను ప్రభాకర్ రావు కొనుగోలు చేశారు. డీఎస్పీ శ్రీనాథ్ రెడ్డి సహకారంతో.. ఢిల్లీలో అధునాతన పరికరాలు కొనుగోలు చేశారు.
బీఆర్ఎస్ నేతల ఫోన్లుపైన కూడా..(Phone Tapping Case)
రెండు మీడియా సంస్దల యజమాన్లు ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగాయని రాధాకిషన్‌రావు వెల్లడించారు. బీజేపీ నేతలు ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ సిబ్బంది ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశామని చెప్పారు. అంతేకాదు తమకు అనుమానమున్న బీఆర్ఎస్ పార్టీ నేతలపైన కూడా నిఘా పెట్టారు. శంబీపూర్ రాజు, కడియం రాజయ్య, పట్నం మహేందర్‌రెడ్డి దంపతులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు . రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి, సరిత తిరుపతయ్య, జువ్వాడి నర్సింగరావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణలకు చెందిన ఫోన్లు కూడా ట్యాప్ చేసామని రాధాకిషన్ రావు వాంగ్మూలమిచ్చారు.