Last Updated:

12A Railway Colony Teaser: అల్లరి నరేష్ ఈసారి పొలిమేర డైరెక్టర్ తో భయపెట్టడానికి వస్తున్నాడు

12A Railway Colony Teaser: అల్లరి నరేష్ ఈసారి పొలిమేర డైరెక్టర్ తో భయపెట్టడానికి వస్తున్నాడు

12A Railway Colony Teaser: అల్లరి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యి.. ఆ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నాడు నరేష్. తండ్రి ఈవీవీ సత్యనారాయణ బ్రతికి ఉన్నంతకాలం కామెడీ హీరోగా ఎన్నో హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించాడు. ఆయన మరణం తరువాత నరేష్ కామెడీ సినిమాలు చేసినా అవి ఆశించినంత ఫలితాన్ని అందివ్వలేకపోయాయి. దీంతో రూట్ మార్చి.. మహర్షి సినిమాలో కీలక పాత్ర చేసి రీఎంట్రీ ఇచ్చాడు. ఇక  నరేష్ ముందున్న అల్లరిని తీసేసి.. మంచి మంచికథలను  ఎంచుకొని నటుడిగా ఎదగడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.

 

ఇక ఈ మధ్యనే నరేష్ నటించిన బచ్చలమల్లి థియేటర్ లో ఆశించిన ఫలితాన్ని  అందించలేకపోయినా  ఓటీటీలో ఈ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పటివరకు నరేష్ అన్ని పాత్రల్లో నటించాడు. హీరో, కమెడియన్, విలన్, ఫ్రెండ్.. ఇలా అన్ని జోనర్స్ లో సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇప్పటివరకు నరేష్ టచ్ చేయని జోనర్ హర్రర్. ఇంట్లో దెయ్యం నాకేం భయం అనే సినిమాలో కూడా హర్రర్ ఉన్నా అది కామెడీ సినిమా కావడంతో అంతగా భయపెట్టలేకపోయాడు.

 

అయితే ఈసారి మాత్రం ప్రేక్షకుల ప్యాంట్స్ తడిచిపోయేలా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరీ నరేష్ ను డైరెక్ట్ చేసేది ఎవరనుకున్నారు. పొలిమేర, పొలిమేర 2 సినిమాలతో టాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేసిన డైరెక్టర్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్. చేతబడి కథాంశంతో వచ్చిన ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్.. 12A రైల్వే కాలనీ సినిమాతో రాబోతున్నాడు.

 

అల్లరి నరేష్,డాక్టర్ కామాక్షి భాస్కర్ల జంటగా డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 12A రైల్వే కాలనీ. ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో  సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటివరకు పోస్టర్ ను కూడా రిలీజ్ చేయని మేకర్స్.. తాజాగా టీజర్ రిలీజ్ చేసి ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. 

 

మునుపెన్నడూ లేనివిధంగా ఆత్మలతో మాట్లాడే వ్యక్తిగా అల్లరి నరేష్ కనిపించాడు. ” ఆవ్ మామ.. ఈ స్పిరిట్ లు, ఆత్మలు కొంతమందికే ఎందుకు కనపడతాయిరా.. అందరికీ ఎందుకు కనబడవు” అనే డైలాగ్ తో మొదలైన టీజర్ అదిరిపోయింది. ముఖ్యంగా భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ కచ్చితంగా భయపెడుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

 

  ఇక చివర్లో ప్రాణాలతో బయటకు పోవుడు అవసరం లేదన్నా అని నరేష్ ఒక ఈవిల్ లుక్ ఇస్తాడు.. నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సమ్మర్ లో రిలీజ్ కానుందని మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమాతో నరేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.