Twitter: ట్విట్టర్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ గా భారత సంతతి వ్యక్తి.. మస్క్ ప్రకటన

ట్విట్టర్లోని ఓ కీలక పదవిని చేపట్టేందుకు భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి మస్క్ అవకాశం కల్పించారు. భారతీయ అమెరికన్‌ అయిన శ్రీరామ్‌ కృష్ణన్‌ను ట్విటర్‌ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌గా నియమిస్తున్నట్లు ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు.

Twitter: ట్విట్టర్లోని ఓ కీలక పదవిని చేపట్టేందుకు భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి మస్క్ అవకాశం కల్పించారు. భారతీయ అమెరికన్‌ అయిన శ్రీరామ్‌ కృష్ణన్‌ను ట్విటర్‌ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌గా నియమిస్తున్నట్లు ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు.

చెన్నైకు చెందిన కృష్ణన్‌ ప్రస్తుతం సిలికాన్‌ వ్యాలీ వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ అయిన యాండ్రీసెన్‌ హోరోవిట్జ్‌(ఎ16జడ్‌)లో భాగస్వామిగా ఉన్నాడు. మరియు అంకుర సంస్థల్లోనూ ఆయన పెట్టుబడులు పెట్టారు. కాగా తాజాగా కృష్ణన్ ను ఎలన్ మస్క్ ట్విట్టర్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ గా నియమించినట్టు ప్రకటించారు. దానితో ‘ట్విటర్‌లో మరికొంత మంది ఉద్యోగులతో కలిసి ఎలాన్‌ మస్క్‌కు తాత్కాలికంగా సహాయం అందించబోతున్నాను. ఈ కంపెనీ ప్రపంచంపై అతిపెద్ద ప్రభావాన్ని చూపేలా మస్క్‌ చూడగలర’ని ఆశిస్తున్నానంటూ కృష్ణన్‌ ట్వీట్‌ చేశారు.

ఇదిలా ఉండగా ఇప్పటికే ట్విట్టర్లో కీలక బాధ్యతలు చేపట్టిన పలువురు అధికారులను మస్క్ తొలగించిన సంగతి తెలిసిందే. భారత్‌కే చెందిన పరాగ్‌ అగర్వాల్‌ను చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ బాధ్యతల నుంచి ఉద్వాసన పలికారు. అంతేకాకుండా హైదరాబాద్‌కు చెందిన విజయ గద్దె(లీగల్‌ ఎగ్జిక్యూటివ్‌)ను కూడా కంపెనీ నుంచి మస్క్ సాగనంపారు. ఇకపోతే సీఎఫ్‌ఓ నెడ్‌ సెగల్‌, జనరల్‌ కౌన్సిల్‌ సీన్‌ ఎడ్జెట్‌లనూ ట్విట్టర్ నుంచి నూతన సీఈవో మస్క్ గెంటేశారు. వారినే కాకుండా కంపెనీ బోర్డు డైరెక్టర్లందరినీ మస్క్‌ సోమవారం తొలగించారు. కేవలం మస్క్‌ ఒకరే ఇపుడు ట్విట్టర్లో సభ్యుడని సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌కు సమాచారం ఇచ్చారు. కొత్త బోర్డును తాత్కాలికంగా ఏర్పాటు చేశామన్నారు కానీ దానికి సంబంధించిన వివరాలను మాత్రం ఇంతవరకూ మస్క్ తెలపలేదు. మరి మన్ముందు ట్విట్టర్లో ఇంకెన్ని కీలక మార్పులు చెయ్యనున్నాడో మస్క్ అనే గుసగుసలు నెట్టింట వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: ట్విటర్ “బ్ల్యూ టిక్” కావాలంటే “8 డాలర్లు” కటాల్సిందే