Elon Musk: టెస్లా చీఫ్‌ఎలాన్ మస్క్ ఇండియాలో టెస్లా కార్ల తయారీ ప్లాంట్‌ను ఉపసంహరించుకున్నట్లు కొన్ని నెలల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఎన్నికల్లో నరేంద్రమోదీ విజయం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ఆయన శుభాకాంక్షల సందేశం తర్వాత మళ్లీ ఇండియాలో మస్క్ టెస్లా ప్లాంట్ ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
ఇండియాలో ప్లాంట్..(Elon Musk)
మస్క్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాజ్వామ్య దేశంలో జరిగిన ఎన్నికలో మోదీ విజయం సాధించారు. ఆయనకు శుభాకాంక్షలు.. తన కంపెనీలు ఇండియాలో ఆకర్షణీయమైన పనులు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు మస్క్ ఎక్స్‌లో ప్రస్తావించారు. తాజా మస్క్ సందేశంతో ఆయన ఇండియాలో ప్లాంట్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గత ఏడాది జూన్‌లో మోదీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు మస్క్ మోదీని కలిశారు. తాను 2024లో ఇండియా పర్యటనకు రానున్నానని.. ఇండియన్ మార్కెట్లో టెస్లాను పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు అప్పుడు మోదీకి మస్క్ చెప్పారు. కాగా ఆయన ఇండియా పర్యటనలో ఎలక్ర్టిక్‌కార్ల తయారీ ప్లాంట్ గురించి ప్రకటన చేస్తారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. టెస్లా కార్లతో పాటు ఆయన శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీ స్టార్‌లింక్‌ను ఇండియా మార్కెట్లో విస్తరించాలనే ఆలోచనలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.
కాగా మస్క్ ఇండియాలో టెస్లా తయారీప్లాంట్ గురించి ప్రకటించే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కాగా దీనికి ఆయన బిలియన్‌ల కొద్ది డాలర్ల పెట్టుబడులు పెట్టి .. వీలైనంత త్వరగా ఇండియాలో కార్ల తయారీ యూనిట్‌ను ప్రారంభించి అమ్మకాలు కూడా మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. కేవలం ఎలక్ర్టిక్ కార్లే కాకుండా ఇండియన్ మార్కెట్లో శాటిలైట్ ఇంటర్నెట్ వ్యాపారం స్టార్‌లింక్‌ను ప్రారంభించాలనే యోచనలో ఉన్నారు. అయితే దీనికి నియంత్రాణా సంస్థల అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు.
దిగుమతి సుంకాన్ని తగ్గించాలని..
ఇదిలా ఉండగా మస్క్ గతంలో ఇండియాలో టెస్లా ప్లాంట్ పెట్టాలంటే దిగుమతి సుంకాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. దీన్ని అప్పుడు కేంద్రమంత్రి గడ్కరీ తిరస్కరించారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం న్యూ ఎక్ర్టిక్ వెహికల్ పాలసీని ప్రకటించింది.దీంతో అప్పుడు మస్క్ రావాలనుకున్నారు. అయితే కొత్త పాలసీ విషయానికి వస్తే దేశంలో కనీసం 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టి తయారీ ప్లాంట్ తెరిస్తే వారికి దిగుమతి సుంకంలో రాయితీ ఇస్తామని ప్రకటించింది. దిగుమతి సుంకంలో రాయితీ వల్ల టెస్లా లాంటి అతి పెద్ద కంపెనీలను ఇండియాలోకి ఆకర్షించాలనేది భారత ప్రభుత్వం ఉద్దేశం.