Banakacherla: జలాల విషయంలో రాజీలేదు.. బనకచర్లపై ఉత్తమ్ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్

Banakacherla: తెలంగాణ జలాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నీటి హక్కుల కోసం రాజకీయంగా, సాంకేతికంగా, న్యాయపరంగా పోరాడుతూనే ఉంటామన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతం పరంగా చూస్తే తెలంగాణకే ఎక్కువ దక్కాలన్నారు. 299 టీఎంసీలు చాలని 68 శాతం జలాలు ఏపీకి కేటాయిస్తే అభ్యంతరం లేదని 2015లో సంతకం చేశారని అన్నారు. 2015లో కేసీఆర్, హరీష్ రావు చేసిన సంతకాలే తెలంగాణకు మరణశాసనంగా మారాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ఏపీ బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు తిరస్కరించడం తెలంగాణ ప్రభుత్వ విజయమన్నారు తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదస్పదంగా మారిన బనకచర్ల ప్రాజెక్టుపై ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, సంబంధిత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్న ప్రభుత్వ వాదనను కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. అందుకే బనక చర్ల ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు తిరస్కరించిందన్నారు. బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు తిరస్కరించడం తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయమన్నారు. బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వాదనలు పూర్తిగా అవాస్తవమన్నారు.
పోలవరం, బనకచర్ల లింకు ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వమని.. కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కేంద్ర జల సంఘం, గోదావరి నదీ జాలాల వివాదాల ట్రిబ్యునల్ పరిశీలించకుండా.. రెండు రాష్ట్రాలు సఖ్యతకు రాకుండా ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం వీలు కాదని చెప్పడం జరిగిందన్నారు. ఇదంతా తమ గొప్పతనమే అంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హరీష్ రావు దీన్ని రాజకీయం చేయాలని చూశారని ఆరోపించారు. ఇది వారి గొప్పదనం కాదని..కాంగ్రెస్ సర్కార్, సీఎం రేవంత్, ఇరిగేషన్ మంత్రి తీసుకున్న నిర్ణయం వల్ల కమిటీ హోల్డ్‌లో పెట్టడం జరిగిందని ఎంపీ చామల తెలిపారు.