Published On:

IPL Turns 18: ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌కు 18 ఏళ్లు.. ఏ జట్టు గెలిచిందో తెలుసా?

IPL Turns 18: ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌కు 18 ఏళ్లు.. ఏ జట్టు గెలిచిందో తెలుసా?

IPL Turns 18 Celebrates Birthday: ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నీ ఐపీఎల్ ప్రారంభమై నేటికి 18 ఏళ్లు పూర్తయింది. తొలుత 2008 ఏప్రిల్ 18న బీసీసీఐ, లలిత్ మోడీ ఈ టోర్నీ ప్రారంభించారు. అయితే అప్పటినుంచి ప్రతి ఏడాది రెండు నెలలపాటు క్రికెట్ ఫ్యాన్స్‌ని అలరిస్తూ వస్తోంది. ఈ టోర్నీ చాలామంది క్రికెటర్ల టాలెంట్ బయటపడేందుకు వేదికగా నిలిచింది.

 

తాజాగా, ఐపీఎల్ ఎక్స్ హ్యాండిల్ స్పెషల్ ట్వీట్ చేసింది. ఇందులో కలలు నిజమయ్యాయి. మనసులు ఉప్పొంగాయి.. కేరింతలు మార్మోగాయి అంటూ క్యాప్షన్‌తో ఓ ఫొటోను షేర్ చేయగా.. వైరల్ అవుతోంది. ఇక, ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. అంతకుముందు 8 జట్లతో ప్రారంభమైన ఐపీఎల్.. ప్రస్తుతం 10 జట్లకు చేరింది.

 

ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, కోల్‌కతా పైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీపడుతున్నాయి.

 

ఇదిలా ఉండగా, 2008లో తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగింది . ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 222 పరుగులు చేసింది. తర్వాత 223 పరుగుల భారీ లక్ష్యఛేదనలో బెంగళూరు 82 పరుగులకే బోల్తా పడింది. ఈ విజయంతో కోల్‌కతా రికార్డు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా తొలి విజయం నమోదు చేసుకుంది.

 

ఇక ఐపీఎల్ టైటిల్ విన్నర్స్ విషయానికొస్తే.. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తొలి టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత 2009లో డెక్కన చార్జర్స్ కైవసం చేసుకుంది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్(2010, 2011) వరుసగా రెండు సార్లు గెలుచుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్(2012), ముంబై ఇండియన్స్(2013), కోల్‌కతా నైట్ రైడర్స్(2014), ముంబై ఇండియన్స్(2015), సన్‌రైజర్స్ హైదరాబాద్(2016), ముంబై ఇండియన్స్(2017), చెన్నై సూపర్ కింగ్స్(2018), ముంబై ఇండియన్స్(2019, 2020), చెన్నై సూపర్ కింగ్స్(2021), గుజరాత్ టైటాన్స్(2022), చెన్నై సూపర్ కింగ్స్(2023), కోల్‌కతా నైట్ రైడర్స్(2014) టైటిల్ సాధించాయి. ఎక్కువగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు చెరో 5 సార్లు టైటిల్ గెలుచుకున్నాయి.