BCCI: బెంగళూరు తొక్కిసలాటపై బీసీసీఐ కీలక నిర్ణయం

BCCI Takes Crucial Decision on Bengaluru Stampede: ఐపీఎల్ 2025 సీజన్ టైటిల్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే 18 ఏళ్ల నిరీక్షణ అనంతరం టైటిల్ గెలుచుకున్న బెంగళూరు జట్టు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో భారీగా విజయోత్సవాలు చేయాలని డిసైడ్ అయింది. బెంగళూరులో విక్టరీ పరేడ్, చిన్నస్వామి స్టేడియంలో సెలబ్రేషన్స్ చేయాలని నిర్ణయించింది. అయితే వేడుకలు జరుగుతున్న సమయంలోనే స్టేడియం బయట భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా 47 మందికి పైగా గాయపడ్డారు. ఘటనలో ఆర్సీబీపై కేసు నమోదు అయింది. అలాగే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ మీద కూడా కేసులు బుక్ అయ్యాయి.
కాగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ విజేతలు సెలబ్రేషన్స్ కు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని బీసీసీఐ తెలిపింది. టైటిల్ గెలిచిన 3,4 రోజుల తర్వాతే విజయోత్సవాలు చేసుకోవాలని నిబంధన పెట్టింది. అలాగే ఈవెంట్ కు బీసీసీఐ బోర్డు పర్మిషన్ తీసుకోవాలని, 4 అంచెల భద్రత తప్పనిసరి అని స్పష్టం చేసింది. జిల్లా అధికారులు, పోలీసుల నుంచి అనుమతి పొందాలని సూచించింది. వేడుకలకు హాజరయ్యేందుకు ఎయిర్ పోర్ట్ నుంచి ఈవెంట్ వేదిక వరకు పూర్తి భద్రత ఉండాలని తెలిపింది.