President Draupadi Murmu :రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం భూదాన్ పోచంపల్లిని సందర్శించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చిన ఆమె ముందుగా పట్టణంలోని ఆచార్య వినోబా భావే భవన్‌కు వెళ్లారు. అక్కడ వినోబా భావే, వెదిరె రామచంద్రారెడ్డి చిత్రపటాలకు ఆమె నివాళులర్పించారు. అనంతరం వినోబా భావే భవనంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించిన ఆమె పోచంపల్లి టై అండ్ డై, ఇకత్ చీరల తయారీని పరిశీలించారు.
బాలాజీ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ చేనేత నైపుణ్యాన్ని చాటి చెప్పేలా ఏర్పాటు చేసిన థీమ్ పెవిలియన్‌ను రాష్ట్రపతి ద్రౌవది ముర్ము సందర్శించారు. ఇక్కడ పోచంపల్లి ఇకత్, పుట్టపాక తెలియ రుమాళ్లు, ముచ్చపేట, నారాయణపేట, గద్వాల చీరలు, సిద్దిపేట గొల్లభామ చీరలతో పాటు చేనేతకు సంబంధించిన పలు స్టాళ్లను ఏర్పాటు చేసారు. చీరల తయారీ మరియు చరఖా ప్రదర్శనలను ద్రౌపది ముర్ము ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్బంగా చేనేత కార్మికుల ఆందోళనలను గుర్తించిన రాష్ట్రపతి, వారి అభ్యర్థనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. సకాలంలో నూలు పంపిణీ ప్రాముఖ్యతను గుర్తించిన ఆమె, ఈ సమస్యను పరిష్కరించడానికి పోచంపల్లిలో నూలు డిపో ఏర్పాటును పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. చేనేత కార్మికులను కార్మికులుగా కాకుండా కళాకారులుగా గుర్తించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, విజ్ఞానానికి సంబంధించిన జాతీయ సంస్థను స్థాపించాలనే ఆలోచనను ముర్ము ప్రశంసించారు.
ఇకత్ సిల్క్ చీరల విక్రయాలను ప్రోత్సహించాలన్న సూచనకు తన మద్దతు తెలుపుతూ పోచంపల్లి పట్టు చీరలకు బ్రాండ్‌ను రూపొందించడం వల్ల పరిశ్రమకు మేలు జరుగుతుందని రాష్ట్రపతి అంగీకరించారు. గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పించడంలో చేనేత పరిశ్రమ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి, ఈ రంగానికి వారు చేసిన కృషికి అవార్డు గ్రహీతలను ప్రశంసించారు. చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం, అధికారులు మరింత చొరవ చూపాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు.