GHMC Commissioner Amrapali: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి పారిశుధ్య పరిస్దితులను తనిఖీ చేసారు. నారాయణగూడ క్రాస్ రోడ్డులో పారిశుధ్యాన్ని పరిశీలించిన కమిషనర్ అక్కడ నిర్మించిన మార్కెట్ భవనంలో గదుల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు.
అదేవిధంగా శంకర మఠం వద్ద ఆర్‌ఎఫ్‌సి వాహనం డ్రైవర్‌తో మాట్లాడి చెత్త తరలింపుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఒక విద్యార్దినితో మాట్లాడి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు.చెత్తను స్వచ్ఛ ఆటో లకు అందించే విధంగా తోటి విద్యార్థులకు అవగాహన కల్పించి స్వచ్చ హైదరాబాద్ సాధనకు కృషి చేసే విధంగా ప్రయత్నించాలని సూచించారు. మరోవైపు కమీషనర్ అమ్రపాలి ఈనెల 6న నిర్వహించనున్న జిహెచ్ఎంసి 9వ సాధారణ సమావేశానికి ఆయా విభాగాల అధికారులు పూర్తి సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశంలో ప్రశ్నలకు సంబంధించి ఆయా విభాగాల అధికారులు సమగ్ర వివరణ ఇచ్చేలా సిద్ధం కావాలని సూచించారు. పూర్తి సమాచారాన్ని అందించాలని కోరారు. కౌన్సిల్ సమావేశం సాఫీగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.