Droupadi Murmu: ఏకత్వానికి ప్రతీక.. కోటి దీపోత్సవంలో తొలి దీపాన్ని వెలిగించిన రాష్ట్రపతి

President Droupadi Murmu Graces Koti Deepotsavam in Hyderabad: పవిత్ర కార్తీక మాసంలో జరుగుతున్న కోటి దీపోత్సవంలో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గురువారం హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవానికి ఆమె విశిష్ట అతిథిగా హాజరై, తొలి కార్తీక దీపాన్ని వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన పూరీ జగన్నాథునికి, యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులనుద్ధేశించి రాష్ట్రపతి ముర్ము మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గవర్నర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు.

పరమ పవిత్రం కార్తీకం
భారతీయ సంప్రదాయంలో ప్రతి శుభకార్యాన్ని దీపం వెలిగించటంతోనే ప్రారంభిస్తారని రాష్ట్రపతి గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా భక్తులు కార్తీక మాసంలో పరమేశ్వరుడిని కొలుస్తారని గుర్తుచేశారు. పెద్దసంఖ్యలో ప్రజలు ఒక్కచోట చేరి దీపారాధన చేయటం అనేది ఏకత్వాన్ని సూచిస్తోందని, ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.

నేడు లోక్ మంథన్‌కు
కాగా, శుక్రవారం ఉదయం రాష్ట్రపతి హైదరాబాద్ శిల్పారామం వేదికగా జరుగుతున్న లోక్ మంథన్ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా హాజరు కానున్నారు. పలు దేశాల ప్రతినిధులు పాల్గొనే సదస్సును ఆమె ప్రారంభించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 12.05 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు.

ప్రభుత్వం ఘన స్వాగతం..
రెండురోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా గురువారం ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా రాజభవన్ చేరుకున్న రాష్ట్రపతి కాస్త విరామం తర్వాత కోటి దీపోత్సవానికి హాజరై, తిరిగి రాజభవన్ చేరుకున్నారు.