Bhadradri Kothagudem District : తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న శ్రీనివాసరావు ఏసుక్రీస్తు దయవల్లే కరోనా తగ్గుముఖం పట్టిందన్నారు. దేశ అభివృద్ధికి క్రైస్తవ మతమే కారణమన్నారు.
యేసు నామాన్ని అనునిత్యం స్మరిస్తూ ఆ దేవుణి సందేశాన్ని ప్రతి ఒక్క గుండెకు, గడపకు చేరేలా చెయ్యాలి. ఇంతకు ముందు జరుపుకున్న క్రిస్మస్‌లు వేరు. ఇప్పుడు జరుపుకుంటున్న క్రిస్మస్‌లు వేరు. గత రెండున్నర సంవత్సరాల నుంచి ప్రపంచ మానవాళికి ప్రశ్నార్థకంగా కొవిడ్ మారింది. దాన్నుంచి మనం ఇవాళ పూర్తిగా విముక్తి అయ్యాం. అది మనం చేసిన సేవల వల్ల కాదు. యేసు క్రీస్తు కృప, యేసు క్రీస్తు దైవం యెుక్క దయ ప్రభావం అంటూ శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలంలోని జిమ్నా తండాలో నిర్వహించిన పూజల్లో డీహెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. తనను తాను దేవతగా చెప్పుకుంటున్న సుజాత నగర్ ఎంపీపీ విజయలక్ష్మితో కలిసి పూజల్లో పాల్గొన్న శ్రీనివాసరావు మంటల్లో నిమ్మకాయులు వేస్తున్న వీడియో కూడా బయటకువచ్చింది. ఆయన ఎంపీపీ చుట్టూ ప్రదక్షిణలు కూడా చేశారు. ఈ విషయం బయటకు రావడంతో డీహెచ్ శ్రీనివాస్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాను గిరిజన పూజలు మాత్రమే చేశానని డీహెచ్ శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు. స్థానికుల ఆహ్వానం తోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో జరిగిన పూజ కార్యక్రమానికి వెళ్లినట్లు చెప్పారు. తాను మూఢ నమ్మకాలను అసలే విశ్వసించనని చెప్పారు.