Lashkar Bonalu 2023: ప్రతి ఏడాది ఆషాడమాసంలో బోనాలు ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఏడాది ఆషాడమాసం జూన్ 24న మొదలై జులై 16 వరకు ఉండనుంది. ఈ మాసంలో హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో బోనాల ఉత్సవాలు జరుగుతాయి. తొలుత గోల్కొండలో ప్రారంభమైన బోనాల ఉత్సవాలు ఆ తర్వాత సికింద్రాబాద్ బోనాలు, ఆ తర్వాత రెండు నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో బోనాలు జరుగుతాయి. మహిళలు బోనమెత్తుకుని అమ్మవార్లకు తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలోనే నేడు లష్కర్ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు పెద్దసంఖ్యలో భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. తొలి పూజల అనంతరం తెల్లవారుజామున 3.30 గంటలకు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, బోనం సమర్పించారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు, అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు ఉదయం నుంచే క్యూకట్టారు. దీనితో ఆలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది.
భక్తుల కోసం ప్రత్యేక బస్సులు(Lashkar Bonalu 2023)
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ ఉదయం 9.30 గంటలకు అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కాగా ఇప్పటికి తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇకపోతే అమ్మవారిని దర్శించుకునే భక్తుల కోసం ఆరు క్యూలు ఏర్పాటు చేశారు. బోనాల నేపథ్యంలో ఆర్టీసీ బస్సు ప్రత్యేకంగా 150 సిటీ బస్సులను నడుపుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు, బోనాల నేపథ్యంలో సికింద్రాబాద్ ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నాయి. పలు రహదారుల్లో ట్రాఫిక్ అంతరాయం రాకుండా ట్రాఫిక్ పోలీసులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. సికింద్రాబాద్ వైపు నుంచి వెళ్లే ట్రాఫిక్‌ను నేడు, రేపు ప్రత్నామ్నాయ మార్గాల గుండా మళ్లిస్తున్నారు.