Amaravati: విశాఖకు రైల్వే జోన్ రాకపోతే తాను రాజీనామా చేస్తానని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రైల్వే జోన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. విభజన చట్టంలో రైల్వే జోన్ గురించి స్పష్టంగా చెప్పారన్నారు. నిన్నటి సమావేశంలో రైల్వే జోన్ గురించి చర్చకు రాలేదన్నారు. రైల్వే జోన్ కోసం వైసీపీ ఎంతో పోరాటం చేసిందన్నారు.
విభజన సమస్యల పరిష్కారం పై కేంద్ర హోంశాఖ మంగళవారం నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఇందులో ఏపీకి రైల్వే జోన్ తో పాటు రాజధానికి నిధులు, తెలంగాణ నుంచి బాకీలు ఇప్పించడం వంటివి ఉన్నాయి. అయితే ఏపీకి రైల్వే జోన్ ఇవ్వడం సాధ్యం కాదని రైల్వే బోర్డు చెప్పినట్లు సమాచారం. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ సాధ్యం కాదని రైల్వేబోర్డు అధికారులు స్పష్టం చేసినట్టు తెలిసింది. కొత్త జోన్ ఏర్పాటు రైల్వేకు ఎంతమాత్రం లాభదాయకం కాదని, అందుకే డీపీఆర్ సైతం రూపొందించలేదని వెల్లడించినట్టు సమాచారం. దీనిపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. లాభదాయకం కాదని ర్వైల్వేజన్ ఏర్పాటు చేయకపోవడం సహేతుకం కాదన్నారు. గతంలో ఎన్నో జోన్లు ఏర్పాటుచేసిన విషయాన్ని గుర్తుచేశారు.
దీనిపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి భల్లు కలుగజేసుకున్నారు. జోన్ ఏర్పాటు అనేది అధికారుల స్థాయిలో తీసుకునే నిర్ణయం కాదని, రైల్వే శాఖ నివేదికను కేంద్ర కేబినెట్ కు పంపితే వారే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కాగా సమావేశంలో రాజధానికి కేంద్రం నిధులు వంటివి ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. కానీ ఏపీ అధికారులు మాత్రం సమావేశంలో ఏం చర్చించారన్న దానిపై నోరు మెదపడం లేదు. ఇప్పటికే రైల్వే జోన్ ఇచ్చేస్తున్నట్లు పలుమార్లు చెప్పిన కేంద్రం. ఇప్పుడు మాత్రం సాధ్యం కాదని చెప్పడం పై ఇది కూడ ప్రత్యేక హోదా తరహాలోనే పక్కనపడేస్తారా అన్న అనుమానాలు వస్తున్నాయి.