Free Sand Policy in A.P. ఏపీలో నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. దీనిపై సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం కార్యాచరణను సిద్ధం చేసింది. మొదట అన్ని జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంప్‌ల నుంచి ఇసుకను అందజేస్తుంది. ప్రభుత్వం ఎటువంటి రాబడి తీసుకోకుండా నిర్వహణ ఖర్చులు, సీనరేజ్ మాత్రమే వసూలుచేసి ప్రజలకు అందజేయనుంది.
రాష్ట్రంలో 43 లక్షల టన్నుల ఇసుక నిల్వలు..( Free Sand Policy in A.P.)
మరోవైపు ఇప్పటికే రాష్ట్రమంతటా 43 లక్షల టన్నుల నిల్వలు ఉన్నట్లు గనులశాఖ అధికారులు లెక్కతేల్చారు. ఇదంతా ఇవాళ్టి నుంచి అందజేయనున్నారు. సెప్టెంబరు వరకు మూడు నెలలకు 88 లక్షల టన్నులు అవసరం ఉంటుందని, ఏడాది కాలానికి 3.20 కోట్ల టన్నుల ఇసుకకు డిమాండ్ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉపాధి కల్పించే నిర్మాణ రంగానికి ఇసుక ప్రాథమిక ఇన్‌పుట్. ఇసుక ధరను సహేతుకమైన నియంత్రణలో ఉంచకపోతే, నిరుద్యోగం, వేతనాల నష్టం మరియు రాష్ట్రంలో పెట్టుబడి వాతావరణం మరియు పారిశ్రామికీకరణ ప్రక్రియపై ప్రభావం వంటి ప్రతికూల సామాజిక-ఆర్థిక పరిణామాలకు అవకాశం ఉందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇరిగేషన్ పనులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రాజధాని భవనాలు మొదలైన నిర్మాణ కార్యకలాపాలకు అవసరమైన ఇసుకను వినియోగదారులకు సహేతుకమైన ధరకు అందుబాటులో ఉండేలా చూడటం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని తెలిపింది.
జిల్లా స్దాయి కమిటీలు..
ఇసుక సరఫరా , నియంత్రణకు సంబంధించి కార్యకలాపాలను పర్యవేక్షణ, నిర్వహణకు ప్రభుత్వం జిల్లా స్థాయి ఇసుక కమిటీలను (DLSC) కూడా ఏర్పాటు చేసింది.ప్రతి కమిటీకి సంబంధిత జిల్లా కలెక్టర్లు చైర్మన్‌గా ఉంటారు. ఈ కమిటీలో పోలీసు సూపరింటెండెంట్ (SP), జాయింట్ కలెక్టర్, సబ్-కలెక్టర్/ ఆర్డీవో మరియు ఇతరులతో సహా అధికారులను కలిగి ఉంటారు. ఈ కమిటీలకు కొన్ని లక్ష్యాలను కూడా నిర్దేశించారు. వినియోగదారులకు సరసమైన ధరలకు ఇసుకను అందుబాటులో ఉంచడం, ఇసుక కార్యకలాపాలపై పారదర్శకత,సమర్థవంతమైన విజిలెన్స్ మరియు మానిటరింగ్ మెకానిజం ద్వారా అక్రమ ఇసుక తవ్వకాలు మరియు రవాణాకు అస్కారం లేకుండా చూడటం ఈ కమిటీలు అనుసరించాలి. ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి సుప్రీంకోర్టు, హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జారీ చేసిన అన్ని పర్యావరణ నిబంధనలు, ఆదేశాలను పాటించాలని కూడా ప్రభుత్వం పేర్కొంది.