Hyderabad: భాగ్యనగరంలో ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినంగా అమలుచేయాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. అప్పుడే వాహన వినియోగదారుల ప్రవర్తనలో మార్పు వస్తుందని, తద్వారా నగర రహదారులు అందరికీ సురక్షితంగా, సౌకర్యవంతంగా మారుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగా రాంగ్ రూట్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ ట్రాఫిక్ ఉల్లంఘనలపై నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఇందులో భాగంగా భారీగా ఫైన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు.
నేటి నుంచి రాంగ్‌రూట్, ట్రిపుల్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులెవ్వరూ లేరు కదా అని ఇష్టానుసారంగా వాహనం నడిపినా.. ఎవరూ చూడడం లేదని నిబంధనలకు విరుద్ధంగా సిగ్నల్స్ జంప్ చేసినా సీసీ కెమెరాల్లో దృశ్యాలను బట్టి.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా నిబంధనల మేరకు వాహనాలను నడుపుతూ ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగకుండా చూడాలని కోరుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ రోప్ విజయవంతం కావడంతో.. తాజాగా ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారు.
రాంగ్ రూట్ లో వచ్చే వాహనాలకు 1700 రూపాయలు, ట్రిపుల్ రైడింగ్ కు 1200 రూపాయల వరకు ఫైన్ విధించనున్నారు. ఇక జీబ్రా లైన్ దాటితే 100 రూపాయల ఫైన్, ఫ్రీ లెఫ్ట్ కు అడ్డుపడితే 1000 రూపాయల జరిమానా విధించనున్నారు.