Heavy Rains In AP next two days: ఏపీలో మరో 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శనివారం వరకు అల్పపీడనం మారనుంది. ఈ అల్ప పీడనం మరో రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగండం ప్రభావంతో తర్వాత బుధవారం వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ ప్రభావంతో రాయలసీమలోనూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ అల్పపీడనం తుఫానుగా బలపడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆ తర్వాత తుఫాన్ కాస్తా తీవ్ర వాయుగుండంగా బలహీనంపడి ఈనెల 27 వరకు తమిళనాడుతో పాటు ఏపీలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇదిలా ఉండగా, పంటలు కోత సమయంలో వర్ష ప్రభావం పొంచి ఉండడంతో ప్రభుత్వం రైతులను అలర్ట్ చేసింది. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వరి ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశాలు జారీ చేసింది. సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారులు చేపలు పట్టేందుకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ప్రజలు అవసరమైతే తప్పా బయటకు వెళ్లొదని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు.