Kaleshwaram Probe: కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో వివిధ హోదాల్లో సెక్రెటరీలుగా పనిచేసిన దాదాపు 10 మంది ఐఏఎస్ లు ఈరోజు విచారణకు హాజరయ్యారు . కాగా వీరి హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాలు, అందుకు గల కారణాలను కమిషన్ అడిగి తెలుసుకుంది. విచారణలో చెప్పిన అంశాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని కమిషన్ ఆదేశించింది. అందుకోసం పదిరోజుల గడువు ఇచ్చింది.
మేడిగడ్డకు మార్చడం వల్లే..( Kaleshwaram Probe)
ప్రస్తుత ఫైనాన్షియల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు బడ్జెట్ సెషన్స్ కారణంగా గడువు కోరగా..అందుకు ఆగస్టు 5 వరకు కమిషన్ సమయం ఇచ్చింది .వీరిలో ముఖ్యంగా రిటైర్డ్ ఐఎఎస్ అధికారులు సోమేష్ కుమార్, ఎస్కే జోషి, రజత్ కుమార్, ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి స్మిత సబర్వాల్, ప్రస్తుత ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీనియర్ ఐఎఎస్ అధికారి వికాస్ రాజ్ లను మధ్యాహ్నం వరకు కాళేశ్వరం కమిషన్ విచారించింది. ఇక మధ్యాహ్నం విద్యుత్ జెఎసి రఘు కూడా తన అభిప్రాయాలను చెప్పారు. కాళేశ్వరం డిజైన్ ను తుమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం ఇంజనీరింగ్ బ్లండర్ అని ఆయన అన్నారు. తుమ్మిడి హట్టి వద్ద నీళ్ళు లేవు కాబట్టి ప్రాజెక్ట్ నిర్మాణస్థలం మార్చాం అనేది అబద్దమని 148మీటర్ల వద్ద కూడా తుమ్మిడి హట్టి వద్ద నీళ్లు తీసుకోవచ్చని తెలిపారు. డిజైన్ మార్చడం వల్ల వందల కోట్ల నిర్వహణ భారం పెరిగిందని .. 2లక్షల ఎకరాల ఆయకట్టు కోల్పోయినట్లు చెప్పారు. తుమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం అశాస్త్రీయమని డిపిఆర్ అప్రూవల్ కు ముందే బ్యారేజ్ లు నిర్మించడం వల్ల కూడా డిజైన్లలో లోపాలు జరిగాయని అన్నారు.
అంతేకాదు కాళేశ్వరం నిర్మాణ స్థలం ఎంపికలో కూడా తప్పు జరిగిందని .. ఇపిసి కాంట్రాక్టులో పని ఎక్కువైనా, తక్కువైనా ప్రభుత్వానికి సంబంధం ఉండదు కానీ పని ఎక్కువైనప్పుడు ఎక్కువ కట్టించారని అన్నారు. అయితే పని తక్కువ అయినప్పుడు మాత్రం రికవరీ చేయలేదని.. ఆఖరికి పని పూర్తి అయిన తర్వాత ఒక్క రోజు కూడా మైంటైనెన్స్ చేయకపోవడం వల్లే సమస్యలు వస్తున్నట్లు పేర్కొన్నారు. సర్వీస్ బే లెవల్ పంపుల కంటే తక్కువ పెట్టడం వల్ల పంప్ హౌజ్ లు దెబ్బ తిన్నాయని .. అందుకు సంబందించిన వివరాలన్నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించినట్లు రఘు తెలిపారు .