Site icon Prime9

CM Revanth Reddy on Arogyashri: ఆరోగ్యశ్రీకి, రేషన్ కార్డుకు లింక్ పెట్టొద్దు.. సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy

CM Revanth Reddy

CM Revanth Reddy on Arogyashri: ఆరోగ్యశ్రీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యశ్రీకి, రేషన్ కార్డుకు లింక్ పెట్టొద్దన్నారు. తెలంగాణలో ప్రతిఒక్కరికీ ఆరోగ్యశ్రీ సేవలు అందాలని ఈ మేరకు సూచించారు.సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ తెలంగాణ సంస్కృతిని అలవర్చుకుని ప్రజలకు సమర్థవంతంగా సేవలందించాలని కోరారు. తెలంగాణ సంస్కృతిలో పాలుపంచుకోవడం ద్వారానే ప్రజలకు సక్రమంగా సేవలు అందించగలుగుతారని అన్నారు. తెలంగాణను తమ సొంత రాష్ట్రంగా భావించి ప్రగతి పథంలో నడుచుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. రాష్ట్రంలో ప్రతిఒక్కరీకి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలన్నారు. రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉంది… ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి కొత్త జీవో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు.

ఏసీ గదులనుంచి బయటకు రండి..(CM Revanth Reddy on Arogyashri)

అలాగే ఆర్ఎంపీ, పీఎంపీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. ఇక రూరల్ ఏరియాలో పనిచేసే వైద్యులకు పారితోషికం ఎక్కువ అందించి ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతీ బెడ్‌కు ఒక సీరియల్ నెంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చూడాలని సీఎం రేవంత్ తెలిపారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు శంకర్‌, శ్రీధర్‌ వంటి వారి సేవలను గుర్తుంచుకుని వారి వారసత్వాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్లను కోరారు.కేవలం ఏసీ గదులకే పరిమితమైతే మీకు కూడా తృప్తి ఉండదు. బయట ఏం జరుగుతోందనేది మీరు చూడాలి. విద్య పట్ల ప్రభుత్వ నిబద్ధతను గురించి చెబుతూ ఒక్కో విద్యార్థికి ప్రతినెలా రూ.85 వేలు ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల నిర్వహణ సజావుగా సాగేలా విద్యావ్యవస్థను పరిరక్షించాల్సిన అవసరం ఉందని వాటి పర్యవేక్షణ బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలని కోరారు.

ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీల సందర్భంగా విద్యార్థులు ఉద్వేగానికి లోనైన సందర్భాలను రేవంత్ రెడ్డి గుర్తు చేసారు. కలెక్టర్లు బదిలీ అయినపుడు కూడా ప్రజలు అలా స్పందించాలని అన్నారు. ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలని, ఆరు హామీలను పారదర్శకంగా అమలు చేయాలని, ప్రజల సంక్షేమం పట్ల పాలనా నిబద్ధతపై ప్రజల్లో విశ్వాసం నింపాలని కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

Exit mobile version