Last Updated:

Chandrababu: ఇవే నా చివరి ఎన్నికలు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరారు. ఈ సారి గెలిపించకుంటే ఇవే తన చివరి ఎన్నికలు అవుతాయని ఆయన అన్నారు.

Chandrababu: ఇవే నా చివరి ఎన్నికలు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Chandrababu: ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని మూడు రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు పత్తికొండ సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ఆయన ప్రజలను కోరారు. టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలన్నారు. ఈ సారి గెలిపించకుంటే ఇవే తన చివరి ఎన్నికలు అవుతాయని ఆయన వ్యాఖ్యానించటం  హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా జగన్‌ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

రాష్ట్రంలో వైసీపీ సర్కార్ అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేస్తోందని పేదలను ఆర్థిక కష్టాల్లో నెట్టేశారని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశారని అన్నదాతల ఆత్మహత్యల్లో దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానానికి చేరుకున్నామని చంద్రబాబు వాపోయారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, పత్రికల్లో వార్తలు రాసినా దాడులు చేస్తున్నారని ఆగ్రహించారు. జగన్‌ దావూద్‌ ఇబ్రహీంను మించిపోయాడని, తనని తిరిగి ఇంటికి పంపే సమయం ఆసన్నమైందని చంద్రబాబు విమర్శించారు.

ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ గౌరవ సభ కాదు కౌరవ సభని తాను మళ్లీ సీఎం అయిన తరువాతే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశానని మరోమారు గుర్తుచేశారు చంద్రబాబు.
అందుకే మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభగా మారుస్తానని దానికి ప్రజల సహకారం కావాలి ఆయన అన్నారు. మీరంతా నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే సరి.. లేదంటే ఇదే నాకు చివరి ఎన్నిక అవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

టీడీపీ వస్తే పథకాలు కట్‌ చేయనని, అభివృద్ధి చేస్తామని, అప్పులు చేయకుండా సంపదను పెంచి పేదలకు పంచే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
జగన్‌ గొప్పగా చెబుతున్న నవరత్నాలు నవమోసాలని ఆయన విమర్శించారు. మరోవైపు చివరి ఎన్నికలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. నిజంగానే చంద్రబాబు రాజకీయాలకు గుడ్ బై చెబుతారా అన్న చర్చ మొదలైంది. ఇక ఇదిలా ఉంటే కర్నూలు వచ్చిన చంద్రబాబుకు పెద్దఎత్తున ప్రజలు స్వాగతం పలికారు. ఓర్వకల్లు, కోడుమూరు, కల్లూరు, దేవనకొండ మండలాల్లో పల్లెపల్లెనా ప్రజలు భారీగా తరలివచ్చారు.

ఇదీ చదవండి: వైసీపీకి షాక్.. ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్

 

ఇవి కూడా చదవండి: