Venice: ప్రపంచంలోని అగ్రశ్రేణి పర్యాటక ప్రదేశాలలో ఒకటైన వెనిస్ పర్యాటకులకు ప్రవేశ రుసుమును విధించే ప్రణాళికను ప్రకటించింది. యునెస్కో హెచ్చరికల నేపధ్యంలో పర్యాటకులను తగ్గించడానికి చేసిన ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రతిపాదన వచ్చింది. యునెస్కో వెనిస్ ను ప్రమాదంలో ఉన్న ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చనున్నట్లు తెలిపింది.
సామూహిక పర్యాటకం నుండి వాతావరణ మార్పుల వరకు అనేక సమస్యల కారణంగా వెనిస్ కోలుకోలేని నష్టానికి గురవుతుందని యునెస్కో జూలైలో హెచ్చరించింది.యునెస్కో 1987లో వెనిస్‌ను దాని వారసత్వ జాబితాలో అసాధారణమైన నిర్మాణ కళాఖండం గా చేర్చింది, అయితే నగరం పర్యాటకాన్ని మెరుగ్గా నిర్వహించాల్సిన అవసరం ఉందని పదేపదే హెచ్చరించింది. వెనిస్ పెరుగుతున్న నీటి మట్టాలు, వాతావరణ మార్పు మరియు అధిక సంఖ్యలో పర్యాటకుల కారణంగా ప్రమాదంలో ఉందని యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ డైరెక్టర్ లాజరే ఎలౌండౌ అసోమో తెలిపారు.
2024 నుండి, రోజువారీ పర్యాటకులకు 5-యూరోల రుసుము వసూలు చేయబడుతుంది. ఇది 30 రోజుల వరకు ఉంటుంది, ముఖ్యంగా వసంత ఋతువు, వేసవిలో, వారాంతాల్లో, ప్రభుత్వ సెలవు దినాలలో ప్రవేశ రుసుము వసూలు చేస్తారు. వచ్చే ఏడాది నుండి, వెనిస్‌కు వెళ్లే పర్యాటకులు తమ ప్రయాణాన్ని ముందుగానే నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో QR కోడ్‌ను పొందాలి. హోటల్‌లో కనీసం ఒక రాత్రి బస చేసే పర్యాటకులకు, అలాగే 14 ఏళ్లు మరియు అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఐదు-యూరోల పన్ను మినహాయింపు ఉంటుంది. వెనిస్ నగర మేయర్ దీనిని సామూహిక పర్యాటకం నుండి నగరాన్ని రక్షించే ప్రయత్నంగా అభివర్ణించారు.మున్సిపల్ పోలీసులు మరియు అధీకృత ఇన్‌స్పెక్టర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. సరైన QR కోడ్ లేని ఎవరైనా గరిష్టంగా 300 యూరోలు (261 పౌండ్లు) జరిమానాను ఎదుర్కొంటారు.
ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన 1,157 ప్రదేశాలలో వెనిస్ ఉంది., అయితే, ఇటీవలి సంవత్సరాలలో ఇది వాతావరణ సమస్యలతో పోరాడుతోంది. దీనితో రెండేళ్ల కిందట వెనిస్ భారీ క్రూయిజ్ షిప్‌లపై నిషేధం విధించింది. గత సంవత్సరం వెనిస్ లో సుమారుగా 3.2 మిలియన్ల మంది పర్యాటకులు రాత్రిపూట బస చేశారు . 2019లో వెనిస్ కు 5.5 మిలియన్ల మంది సందర్శకులు వచ్చారు.వెనిస్ జనాభా 175,000 నుంచి 50,000 కు పడిపోయింది.