Tollywood New Promotion Stunt: మా సినిమాలు నచ్చకపోతే.. మమల్నికొట్టండి.. ఇదే నయా ట్రెండ్

Tollywood New Promotion Stunt: ఏ వస్తువు మార్కెట్ లోకి వెళ్లాలన్నా ప్రమోషన్స్ అనేవి చాలా ముఖ్యం. ఆ వస్తువును ఎంత గొప్పగా అయినా తయారుచేయనివ్వండి. ప్రజల్లోకి వెళ్లి.. దాన్ని కొన్నప్పుడే దానికి విలువ. అందుకే మార్కెటింగ్ విషయంలో అందరూ ఒక అడుగు ముందే ఉంటారు. ఒక రూపాయి ఎక్కువే ఖర్చుపెడుతుంటారు. సేమ్.. ఇండస్ట్రీలో కూడా అంతే. ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీసాం అన్నది ముఖ్యం కాదు. ప్రేక్షకుల మధ్యకు ఎంతవరకు తీసుకెళ్ళాం అనేది ముఖ్యం.
ప్రమోషన్స్ కే ఎక్కువ ఖర్చు
ఒకప్పటిలా ప్రేక్షకులు ఇప్పుడు లేరు. ఒకప్పుడు అంటే తమ అభిమాన హీరో అని చెప్పగానే ముందు వెనుకా చూడకుండా థియేటర్ లకు వచ్చేవారు. కానీ, జనరేషన్ మారేకొద్దీ కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. అప్పటిలా ఇప్పుడు హీరోలను చూసి ప్రేక్షకులు థియేటర్ కు రావడం లేదు. కథ, కథనం చూసి వస్తున్నారు. మౌత్ టాక్ ను బట్టి వస్తున్నారు. అందుకే మేకర్స్.. సినిమాకు ఎంత ఖర్చు పెడుతున్నారో.. దానికి మించి ప్రమోషన్స్ కు ఖర్చు పెడుతున్నారు. ఒకప్పుడు ప్రమోషన్స్ అంటే.. సినిమాలో నటించినవారు ఇంటర్వ్యూలు ఇస్తే సరిపోయేది. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. జనాలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు.
ఓటీటీల ప్రభావమే కారణం
ఓటీటీ.. ఈ మూడు అక్షరాలు సినిమా ఇండస్ట్రీ రూపురేఖలను మొత్తం మార్చేశాయనే చెప్పాలి. ఒకప్పుడు సినిమా చూడాలి అంటే రెండే దారులు. ఒకటి థియేటర్ కు వెళ్లి చూడడం.. రెండు ఆ సినిమా టీవీలో వచ్చినప్పుడు చూడడం. కానీ, కరోనా ఆ పరిస్థితి మొత్తాన్ని మార్చేసింది. కరోనాకు ముందే ఓటీటీలు కొద్దికొద్దిగా ప్రజలకు తెలిసాయి. ఇక కరోనా లాక్ డౌన్ నుంచి ప్రజలకు ఓటీటీ ఒంటపట్టేసింది. కడుపులో నీళ్లు కదలకుండా.. కుటుంబమంతా కలిసి సినిమాలు చూడొచ్చు.. అని తెలియడంతో సినిమా టికెట్ కు పెట్టే ఖర్చుతో.. ఓటీటీలకు డబ్బులు కట్టి ప్రశాంతంగా సినిమాలు చూస్తున్నారు. ఓటీటీలు..వచ్చాకా థియేటర్ కు వచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది.
మేకర్స్ కు కత్తిమీద సాముగా..
ఓటీటీ ప్రభావం బాగా ప్రేక్షకుల మీద పడడంతో వారిని థియేటర్ కు రప్పించడం మేకర్స్ కు కత్తిమీద సాముగా మారింది. మా కథలో అన్ని ఉన్నాయి. థియేటర్ కు రండి అంటే ఎవరు రావడం లేదు. థియేటర్ లో చూడాల్సిన సినిమా అనుకుంటేనే ప్రేక్షకులు వస్తున్నారు. పెద్దా.. చిన్నా, కొత్త హీరో.. స్టార్ హీరో, భారీ బడ్జెట్.. చిన్న బడ్జెట్.. ఇలా ఏది ప్రేక్షకుడు చూడడం లేదు. కథ బావుందా.. ? థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలా.. ? అప్పుడే టికెట్ కొనుక్కొని వెళ్తున్నారు. అలా ప్రేక్షకులకు నమ్మకం కలిగించడానికి మేకర్స్ నానా కష్టాలు పడుతున్నారు. ఇక దానికోసమే విన్నూతంగా ప్రమోషన్స్ చేస్తూ ప్రేక్షకుల చూపును తమ సినిమావైపు తిప్పుకుంటున్నారు.
ప్రేక్షకుల వద్దకే ప్రమోషన్స్
సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి రిలీజ్ అయ్యే ముందురోజు వరకు చిత్రబృందం మొత్తం బాగా కష్టపడితేనే సినిమా ప్రజల్లోకి వెళ్తుంది. అంతెందుకుఈ సంక్రాంతి సినిమాలే తీసుకుందాం. రామ్ చరణ్- శంకర్ కాంబోలో తెరకెక్కిన చిత్రం గేమ్ ఛేంజర్. సుమారు రూ. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూసారు. ఇక రిలీజ్ డేట్ ప్రకటించాకా.. ప్రమోషన్స్ తుస్స్ అనిపించారు. కథ కొంతమందికి నచ్చినా.. మరికొంతమందికి నచ్చలేదు. కనీసం ప్రమోషన్స్ బాగా చేసి ఉంటే.. ఇంత డిజాస్టర్ అయ్యి ఉండేది కాదేమో అని కొందరి అభిప్రాయం.
ఇక అదే సంక్రాంతికి రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఈ సినిమా రిలీజ్ డేట్ కు నెల ముందు నుంచే.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ చిత్రబృందమే. టీవీ సీరియల్స్, షోస్, యూట్యూబ్ ఛానెల్స్, మీమ్స్.. టూర్స్ ఇలా ఏ ఒక్కదాన్ని వదలకుండా అనిల్ ప్రమోషన్స్ చేశాడు. మునుపెన్నడూ లేనివిధంగా ప్రజలవద్దకే పాలన అన్నట్లు ప్రేక్షకుల వద్దకే ప్రమోషన్స్ తీసుకెళ్లి వారి మనసులను కొల్లగొట్టి మంచి విజయాన్ని పట్టారు.
మార్కెట్ లో కొత్త ప్రమోషన్ స్టంట్
ఇక ఇప్పుడు మార్కెట్ లో కొత్త ప్రమోషన్ స్టంట్ వచ్చింది. అదేంటంటే.. మా సినిమా కనుక నచ్చకపోతే మమ్మల్ని చితక్కొట్టొచ్చు అని మేకర్స్ చెప్పుకురావడం. హీరోలు, నిర్మాతలు చేతిలో మైక్ ఉంటే.. రాజకీయనాయకుల కన్నా ఎక్కువగానే మాట్లాడతారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తమ ప్రొడక్ట్ ను మార్కెట్ లో అమ్మడానికి ప్రోడక్ట్ మేనేజర్ ఎలా అయితే ప్రమోషన్ చేస్తారో.. వీరు కూడా స్టేజిపై మా సినిమా చూడండి.. నచ్చకపోతే డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తాం అని కొందరు. మా సినిమా చూడండి.. నచ్చకపోతే మమ్మల్ని కొట్టండి అని బహిరంగంగా చెప్పుకొచ్చేస్తున్నారు.
కిరణ్ అబ్బవరం అలా.. నాని ఇలా
క సినిమా సమయంలో కిరణ్ అబ్బవరం.. ఈ సినిమా నచ్చకపోతే నేను ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేస్తా అని చెప్పుకొచ్చాడు. అప్పట్లో అది సంచలనంగా మారింది. కిరణ్ ఆ రేంజ్ గా చెప్పాడంటే కథలో విషయముంది అనుకోని ప్రేక్షకులు సినిమాకు వెళ్లారు. ఇక అదే ఫార్ములాను న్యాచురల్ స్టార్ నాని కోర్ట్ సినిమాకు వాడాడు. ఈ సినిమా కనుక నచ్చకపోతే నా హిట్ 3 సినిమా చూడకండి అని చెప్పుకొచ్చాడు. సినిమాపై ఎంత కాన్ఫిడెంట్ ఉండకపోతే ఒక హీరో, నిర్మాత అలా అంటాడు అనే భావనను ప్రేక్షకుల్లో కలిగిస్తున్నారు. నిన్నటికి నిన్న దిల్ రుబా నిర్మాత కూడా ఈ సినిమాలోఫైట్స్ నచ్చకపోతే కనుక మధ్యాహ్నం ప్రెస్ మీట్ లో నన్ను చితక్కొట్టి విసిరేయండి అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఇప్పుడు ఇదే ట్రెండ్ గా మారిపోయింది. ఇవే ఎక్కువ హైప్ ఇస్తున్నాయి.
అవును.. వారు చెప్పినంత మాత్రానా అయిపోతుందా అంటే.. అది వారి నమ్మకం. ఆ నమ్మకంతోనే ప్రేక్షకులను రప్పించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది కొంతమంది ఓవర్ గా అనిపిస్తుంది. ఇవన్నీ వాస్తవాలు అని చెప్పడానికి కూడా లేదు. నమ్మకం వేరు.. ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు. హైప్ పెంచడానికి కూడా ఇలాంటి మాటలను అనొచ్చు అని చెప్పొచ్చు. మరి ఈ ట్రెండ్ ఇండస్ట్రీలో ఎప్పటివరకు కొనసాగుతుంది.. ? వారి నమ్మకాలూ నిలబడ్డాయా.. ? లేదా.. ? అనేది మరో వారంలో తెలుస్తుంది.