Producer Dvv Danayya : తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా ఆస్కార్ ని కూడా సాధించి నెక్స్ట్ లెవెల్ లో టాలీవుడ్ ని .. ఇండియన్ సినిమాని నిలిపిన సినిమా “ఆర్ఆర్ఆర్“. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించగా.. చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల్లో అద్బుతంగా నటించారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. బాహుబలి లాంటి భారీ విజయం దక్కించుకున్న తర్వాత వస్తున్న ఈ చిత్రంపై ఉన్న అంచనాల రీత్యా.. ఆర్ఆర్ఆర్ ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. కేవలం భారత్ లోనే కాకుండా విదేశాల్లో సైతం ఈ మూవీ భారీ సక్సెస్ అందుకుంది.
అయితే విదేశాల్లో ఎన్నో అవార్డులను అందుకున్న ఈ చిత్రానికి సంబంధించి ఎక్కడ చూసినా దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి తదితరులు మాత్రమే కనిపించారు. వారి పేర్లే వినిపించాయి. కానీ ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య ఎక్కడా కనిపించలేదు. ఆయన పేరు ఎక్కడా వినిపించలేదు. ఈ నేపథ్యంలో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై దానయ్య స్పందించారు. తెలుగు ఇండస్ట్రీలో తొలిసారి ఓ పాటకు ఆస్కార్ రావడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ అవార్డు క్రెడిట్ అంతా రాజమౌళికే దక్కుతుందని చెప్పారు.
వాళ్ళతో మాట్లాడేందుకు ప్రయత్నించా కానీ.. – దానయ్య (Producer Dvv Danayya)
‘‘2006లో రాజమౌళికి అడ్వాన్స్ ఇచ్చి సినిమా చేద్దామని అడిగాను. అప్పటి నుంచి ఆయనతో జర్నీ చేస్తున్నా. మర్యాద రామన్న చేయమని ఆఫర్ ఇచ్చారు. కానీ ఇంకా పెద్ద సినిమా చేయాలని అనుకుంటున్నానని ఆయనకు చెప్పాను. తన ప్రాజెక్టులు అయిపోయాక చెప్తానని అన్నారు. అలా తర్వాత ఆర్ఆర్ఆర్ నా చేతికి వచ్చింది’’ అని దానయ్య వివరించారు. ఇద్దరు స్టార్లతో ఇంత పెద్ద సినిమా తీస్తానని ఊహించలేదని ఆయన చెప్పారు. కరోనా వల్ల ఎన్నో కష్టాలు పడ్డామని, బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువే అయిందన్నారు. ఒక్క నాటు నాటు పాటనే 30 రోజులు రిహార్సల్స్ చేసి.. ఉక్రెయిన్ లో 17 రోజులు షూట్ చేశామని తెలిపారు. ఆ కష్టానికి ప్రతిఫలంగానే ఆస్కార్ వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఆస్కార్ అందుకున్నాక రాజమౌళి, కీరవాణి తదితరులతో మాట్లాడేందుకు ప్రయత్నించానని దానయ్య చెప్పారు. అయితే వాళ్లు ఫంక్షన్ లో బిజీగా ఉన్నట్లున్నారని, తాను మాట్లాడలేకపోయానని చెప్పారు.
కాగా ప్రస్తుతం దానయ్య పవన్ కళ్యాణ్ తో ఒక సినిమాని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు అల్లు అరవింద్, సురేశ్ బాబు, దిల్ రాజు వంటి అగ్ర నిర్మాతలు ఈ. యంగ్ డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనుండగా.. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. డీవీవీ దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. గతంలో ఆయన పవన్ తో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాను నిర్మించాడు. మళ్లీ ఇప్పుడు వీరి కాంబినేషన్ వర్కౌట్ అయింది. గ్యాంగ్ స్టర్ నేపధ్యంలో ఈ సినిమా రానున్నట్లు సమాచారం అందుతుంది.