Apsara Murder Case: మనిషిని చంపడమెలా? గూగుల్ లో సెర్చ్ చేసిన సాయికృష్ణ

హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన అప్సర హత్య కు సంబంధింన రిమాండ్‌ రిపోర్టులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్సరను అడ్డు తొలగించుకునేందుకే సాయికృష్ణ హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

Apsara Murder Case: హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన అప్సర హత్య కు సంబంధింన రిమాండ్‌ రిపోర్టులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్సరను అడ్డు తొలగించుకునేందుకే సాయికృష్ణ హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి పూజారి సాయికృష్ణ, అప్సరకు పరిచయం ఉందని.. అది కాస్త వివాహేతర బంధానికి దారితీసిందని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో తెలిపారు.

 

రిమాండ్ లో ఏముందంటే?(Apsara Murder Case)

‘సరూర్‌నగర్‌లోని బంగారు మైసమ్మ ఆలయంలో ఈ ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. సాయికృష్ణ ఎక్కువగా అప్సరకు వాట్సాప్‌ మెసేజ్ లు చేస్తుండేవాడు. వీరిద్దరు గత నవంబరులో గుజరాత్‌లోని సోమనాథ్‌ ఆలయం, ద్వారక గుడిని కూడా సందర్శించారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య బంధం మరింత బలపడింది. అప్సర వాట్సాప్‌ ద్వారా తన ప్రేమను వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసింది. ఒక వేళ తనను పెళ్లి చేసుకోకపోతే రోడ్డుకు ఈడుస్తానంది. అందుకే సాయికృష్ణ ఆమెను అడ్డుతొలగించాలను కుని హత్య చేశాడు. ఇదే విషయాన్ని సాయికృష్ణ కూడా ఒప్పుకొన్నాడు.’ అని రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

 

ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి

కాగా, హత్యకు వారం రోజుల ముందు ‘మనిషిని చంపడం ఎలా..’ అనే విషయంపై సాయికృష్ణ ఇంటర్నెట్‌లో సాయికృష్ణ వెతికనట్టు రిమాండ్‌ రిపోర్టు లో చేర్చారు.‘ తనను కోయంబత్తూర్‌కు తీసుకెళ్లాలని గతంలో అప్సర కోరడాన్నే.. ఆమెను హత్య చేయడానికి ఉపయోగించుకున్నాడు. జూన్‌ 3 వ తేదీ రాత్రి 9 గంటలకు కోయంబత్తూర్‌కు టికెట్‌ బుక్‌ చేశానని అప్సరను నమ్మించాడు సాయికృష్ణ. ఆమెను కారులో ఎక్కించుకొని రాత్రి 8.15 గంటలకు సరూర్‌నగర్‌ నుంచి బయల్దేరాడు. రాత్రి 9 గంటలకు ఇద్దరూ శంషాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ అంబేద్కర్‌ విగ్రహం దగ్గరికి వెల్లిన తర్వాత టికెట్‌ బుక్‌ చేయలేదని చెప్పి. అక్కడి నుంచి గోశాలకి తీసుకెళ్లాడు. రాత్రి తినడానికి రాళ్లగూడ వద్ద ఓ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ దగ్గర కారు ఆపారు. అర్ధరాత్రి 12 గంటలకు సుల్తాన్‌పల్లిలోని గోశాలకు చేరుకున్నారు. ఆమె నిద్రిస్తున్న సమయంలో సాయికృష్ణ హత్య చేశాడు’ అని పోలీసుల రిమాండ్‌ రిపోర్టు చెబుతోంది.