Site icon Prime9

Ganja Smuggling : సంగారెడ్డిలో 635 కిలోల గంజాయి పట్టుకున్న పోలీసులు.. రెండు బొలెరోలు సీజ్

police seize 635 kgs Ganja Smuggling at sangareddy

police seize 635 kgs Ganja Smuggling at sangareddy

Ganja Smuggling : సంగారెడ్డి రూరల్‌ పోలీస్టేషన్‌ పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీల్లో 635 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్‌ తెలిపారు. అలానే రెండు బొలెరో వాహనాలను సీజ్‌ చేసి.. ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు మీడియాకు వివరించారు. దీని విలువ దాదాపు రూ. 3 కోట్ల వరకు ఉండొచ్చని ఆయన చెప్పారు. నిందితులు ముగ్గురూ మహారాష్ట్రకు చెందిన తమ యజమానులు హనుమాన్ మోహిత్, సమీర్ గవండేల ఆదేశం మేరకు ఒడిశాలోని జన్ భాయ్ ఏజెన్సీ ప్రాంతంలో ఉండే త్రినాథ్ అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసినట్లు తెలిపారు.

తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు రవాణా చేస్తున్నట్లు వివరించారు. టాస్క్ ఫోర్స్ అధికారుల సమాచారం మేరకు వాహనాల తనిఖీ నిర్వహించి గంజాయిని సీజ్‌ చేసినట్లు ఎస్పీ తెలిపారు. బొలెరో వాహనాల కింది భాగంలో బాక్సు లాంటి నిర్మాణం ఏర్పాటు చేసి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే టాస్క్ ఫోర్స్ బృందాలు, సంగారెడ్డి రూరల్ సిబ్బంది కలిసి సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు. కీలకంగా వ్యవహరించిన ఇన్‌స్పెక్టర్‌ మహేష్ గౌడ్, కానిస్టేబుళ్లు ఇస్మాయిల్, శంకర్ తదితరులను ఎస్పీ అభినందించారు.

ఎక్కడైనా గంజాయి సాగుచేస్తున్నట్లు గానీ, రవాణా చేస్తున్నట్లు గానీ తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. యువకులు గంజాయికి బానిసై తమ విలువైన భవిష్యత్‌ను పాడు చేసుకుంటున్నారని, కుటుంబాలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారని అన్నారు. మరోవైపు నవంబర్‌ 30 జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ వివరించారు.

Exit mobile version