Site icon Prime9

CAG Chief: కాగ్ చీఫ్‌గా సంజయ్ మూర్తి.. తొలి తెలుగు కాగ్ అధినేతగా గుర్తింపు

Sanjay Murthy as CAG Chief: భారత్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్(కాగ్) నూతన అధిపతిగా కొండ్రు సంజయ్‌ మూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి సంజయ్ మూర్తితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

తొలి తెలుగు వ్యక్తి
కాగ్ నూతన అధిపతిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్‌ అరుదైన ఘనత సాధించారు. ఇప్పటి వరకు కాగ్‌ చీఫ్ గా ఉన్న గిరీశ్‌ చంద్ర ముర్ము పదవీ కాలం ఈ నెల 20తో ముగియగా, దీంతో సంజయ్‌ మూర్తిని రాష్ట్రపతి ఈ నెల 18న నియమించారు. అమలాపురం మాజీ ఎంపీ కేఎస్‌ఆర్‌ మూర్తి కుమారుడు సంజయ్‌మూర్తి కాగా, కేఎస్‌ఆర్‌ మూర్తి 1996లో కాంగ్రెస్‌ తరఫున అమలాపురం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అంతకుముందు కేఎస్‌ఆర్‌ ఐఏఎస్‌ అధికారిగా కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శిగా పనిచేశారు.

విద్యామంత్రిత్వశాఖలో కార్యదర్శిగా..
సంజయ్‌ మూర్తి ఇప్పటి వరకు కేంద్ర ఉన్నత విద్యామంత్రిత్వశాఖలో కార్యదర్శిగా పనిచేశారు. కేంద్రం అమల్లోకి తెచ్చిన నూతన విద్యావిధానాన్ని దేశవ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేయటంలో ఆయన కీలక పాత్ర వహించారు. వాస్తవానికి వచ్చే నెలలో ఆయన రిటైర్ కావాల్సి ఉండగా, ఆయన సేవలకు మెచ్చిన ప్రభుత్వం కాగ్‌గా బాధ్యతలు అప్పగించింది. ఆయన గరిష్ఠంగా ఆరేళ్లు లేదా 65 ఏళ్ల వయసు వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.

Exit mobile version