Janasena : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమర శంఖం పూరించేందుకు సిద్దమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ టాప్ గేర్ లో దూసుకుపోతున్నట్లు కనిపిస్తుంది. వైకాపా ప్రభుత్వ వైఫ్యల్యాన్ని ఎండగడుతూ ప్రజల్లోకి బలంగా జనసేనాని వెళ్తున్నారు. ముఖ్యంగా ఇటీవల ఇప్పటం రోడ్ల విస్తరణ సమస్య, వైజాగ్ పర్యటనలలో పవన్ వైసీపీపై నిప్పులు చెరిగారు. ఇక ఇటీవల సత్తెనపల్లిలో జరిగిన కవులు రైతు భరోసా యాత్రలో వైకాపా మంత్రులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఆ మీటింగ్ లోనే పార్టీ భవిష్యత్తు కార్యాచరణ గురించి కూడా పవన్ నోరు విప్పారు.
వచ్చే ఎన్నికల్లో వైకాపాను గద్దె దింపడమే ధ్యేయంగా జనసేన పని చేస్తుందని… వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తి లేదని వ్యాఖ్యానించారు. అలానే ఆయన మాట్లాడుతూ… పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే వ్యూహం తన వద్ద ఉందని … పార్టీ కార్యకర్తలంతా తన ఆ విషయంలో నమ్మాలని చెప్పారు. దీంతో ఇప్పుడు అసలు పవన్ వ్యూహం ఏమై ఉంటుందా… జనసేనను అధికారం లోకి తీసుకు రావడం కోసం పవన్ ఏం ప్లాన్ వేశారు అని అంతా ఆలోచిస్తున్నారు. ఈ తరుణంలోనే పవన్ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి ? సీఎం అయ్యేందుకు పవన్ చేస్తున్న వ్యూహం ఏంటో ? ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ…
వచ్చే ఎన్నికల్లో జనసేనను అధికారం లోకి తీసుకొచ్చేందుకు పవన్ కళ్యాణ్ పక్కా స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది. ఆ వ్యూహాన్ని ఐదు రకాలుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సేనాని సిద్దం అవుతున్నారు. ఈ ఐదు వ్యూహాలను “పంచతంత్రాలుగా” ప్రయోగించి వైకాపాను గద్దె దింపడానికి రెడీ అవుతున్నారు. ప్రజల్లోకి వెళ్లడం, వారి కష్టాలను తెలుసుకోవడం, వీలైనంత సహాయం చేయడం కోసం జనసేన నిర్వహిస్తున్నా… నిర్వహించనున్న కార్యక్రమాలే ఈ పంచతంత్రాలు. అవి ఏంటంటే…
జనవాణి…
ప్రజా సమస్యల స్వీకారం కోసం పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఆదివారం ఆయన రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజా నుంచి భారీ ఎత్తున స్పందన లభిస్తుంది. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నేతలు ప్లాన్ చేస్తున్నారు.
కౌలు రైతు భరోసా యాత్ర…
రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు జనసేన పార్టీ కౌలు రైతు భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు జనసేన పార్టీ నుంచి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇప్పటివరకు 7 జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్ర కార్యక్రమం పూర్తయింది. ఇటీవలే పల్నాడు జిల్లాలో సత్తెనపల్లిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
యువశక్తి…
పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జనసేన పార్టీకి కొండంత అండగా ఉండేది యువత అని చెప్పాలి. కాగా ఇప్పుడు వారిని ఓ సిస్టమేటిక్ పద్ధతిలోకి తీసుకొచ్చి పార్టీ గెలుపు కోసం వారు పనిచేసేలా చేయనున్నారని సమాచారం అందుతుంది. దీని కోసం జనవరి 12న యువశక్తి సభ నిర్వహించనున్నారు. ఈ సభలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
వారాహి …
పవన్ కల్యాణ్ నిర్వహించబోయే బస్సు యాత్రే పంచతంత్రాల్లో అతి ముఖ్యమైంది. వచ్చే ఏడాది తర్వాత ప్రారంభించి ఎన్నికల వరకు బస్సు యాత్ర నిర్వహించాలని పవన్ ప్లాన్ వేసుకుంటున్నారు. ఇప్పటికే పవన్ యాత్ర కోసం వారాహిని కూడా సిద్దం చేశారు. వారాహి గురించి ఇప్పటికే వైకాపా నేతలతో మాటల యుద్దం తీవ్రంగా జరుగుతుంది. తన వారాహిని ఆపితే అప్పుడు చూపిస్తానంటూ సత్తెనపల్లి సభలో పవన్ ఫైర్ అయ్యారు.
ఇక ఆ ఐదో తంత్రం ప్రస్తుతానికి అయితే సీక్రెట్ గానే ఉంచారు. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పవన్ త్వరలోనే ఈ విషయాన్ని స్వయంగా ప్రకటిస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి జనసేనాని ఈ పంచతంత్ర వ్యూహంతో ప్రజల మద్దతును మరింత పెంచుకొని సీఎం కావాలని జన సైనికులంతా కోరుకుంటున్నారు.