Site icon Prime9

Pawan Kalyan: అటవీ శాఖను బలోపేతం చేస్తాం..డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌

Dy CM Pawan Kalyan: వచ్చే ఐదేళ్లలో అటవీ శాఖను బలోపేతం చేస్తామని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఆదివారం గుంటూరు నగరపాలెంలో అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అటవీ శాఖలో అమరులైన సిబ్బందికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అటవీ సంపదను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. భారతదేశం వసుదేక కుటుంబమన్నారు. ఈ భూమి మనుషులకే కాదు అన్ని ప్రాణులకు నివాసం అని తెలిపారు. అటవీశాఖలో తక్కువ సిబ్బంది ఉన్నప్పటికీ కూడా అధికారులు చాలా కష్టపడి పనిచేస్తున్నారని కితాబునిచ్చారు.

అదనపు నిధులకు ప్రయత్నిస్తా..
అటవీశాఖలో కొంత సిబ్బంది కొరత ఉందని.. నిధులు కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంతో మాట్లాడి అదనపు నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. చిన్నప్పటి నుంచి నాకు ప్రకృతి అంటే ఇష్టమన్నారు. అటవీ శాఖను తాను ఎంచుకోవడానికి కూడా ఇదో కారణమన్నారు. అడవుల రక్షణకు అటవీ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్పారు. అటవీశాఖ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరిచిపోకూడదన్నారు. వివిధ వర్గాల నుంచి అటవీశాఖకు రూ.5కోట్ల విరాళం సేకరించి ఇస్తానని ప్రకటించారు. భవిష్యత్ లో అటవీ అమరులకు స్తూపాలు నిర్మించి నివాళులర్పిద్దామన్నారు. స్మగ్లర్ల నుంచి అడవుల రక్షణకు ఎలాంటి సహాయమైనా అందిస్తానని చెప్పారు. అటవీశాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, విధులు నిర్వహిస్తూ 23 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. అమరుల స్మరణకు ఫారెస్ట్‌ ఆఫీస్‌ బ్లాక్‌లకు వారి పేర్లు పెట్టాలన్నారు. ఐఎఫ్ఎస్ అధికారి శ్రీనివాస్ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు పరిశీలిస్తామని తెలిపారు. ఐదేళ్లలో సాధ్యమైనన్ని సంస్కరణలు తీసుకువస్తానని చెప్పారు. అటవీ శాఖలో అమరుల కుటుంబాలను సన్మానించారు. వారి నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. అటవీ శాఖలో మెరుగైన ప్రతిభ చూపిన వారికి పురస్కారాలు అందజేశారు.

మాది మెతక ప్రభుత్వం కాదు..
ఐఏఎస్‌, ఐపీఎస్‌లతో పాటు అధికారులకు వార్నింగ్‌ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. కూటమిది మంచి ప్రభుత్వమే కానీ.. మెతక ప్రభుత్వం కాదన్నారు. ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల అడిగితే భద్రత కల్పిస్తామని చెప్పారు. ఇరవై ఏళ్లు అధికారంలో ఉంటామంటూ అధికారులను ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకున్నారని, ఘోరమైన తప్పిదాలు చేయించారని జగన్‌ను ఉద్దేశించి పవన్‌ అన్నారు. ‘మాజీ సీఎం అయినా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మీకు బాధ్యత ఉండాలి. సప్త సముద్రాలు అవతల ఉన్నా పట్టుకొస్తామని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడిని, రిటైర్‌ అయినా వదలబోమని డీజీపీని ఉద్దేశించి అన్నారు. అధికారులు తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నారు. మీరు బెదిరిస్తే ఎవరూ బెదిరిపోరు. అధికారులపై చిన్న గాటు పడినా చూస్తూ ఊరుకోం.. వారిపై చిన్న ఈగ వాలినా మీరే బాధ్యత వహించాలి. ప్రజాస్వామ్యాన్ని బలంగా తీసుకెళ్లాల్సిన నాయకులు.. ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎలా?’అని పవన్ కల్యాణ్ నిలదీశారు.

Exit mobile version