Last Updated:

MI vs PBKS: దంచికొట్టిన ఇషాన్ కిష‌న్‌, స్కై.. పంజాబ్ పై ముంబై సునాయాస విజయం

ఐపీఎల్‌ 2023లో భాగంగా మొహాలీ వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్ తో తలపడిన హోంటైన్ పంజాబ్ కింగ్స్ జట్టు ఘోర పరాభవాన్ని చవిచూసింది. పంజాబ్ ఇచ్చిన 215 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ముంబై టీం అలవోకగా 18.5 ఓవ‌ర్ల‌లోనే ముగించేసింది.

MI vs PBKS: దంచికొట్టిన ఇషాన్ కిష‌న్‌, స్కై.. పంజాబ్ పై ముంబై సునాయాస విజయం

MI vs PBKS: ఐపీఎల్‌ 2023లో భాగంగా మొహాలీ వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్ తో తలపడిన హోంటైన్ పంజాబ్ కింగ్స్ జట్టు ఘోర పరాభవాన్ని చవిచూసింది. పంజాబ్ ఇచ్చిన 215 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ముంబై టీం అలవోకగా 18.5 ఓవ‌ర్ల‌లోనే ముగించేసింది. కేవలం నాలుగు వికెట్లు న‌ష్టపోయి ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై బ్యాట‌ర్ల‌లో ఇషాన్ కిష‌న్‌, స్కై వీర విహంగం చేశారనే చెప్పాలి. మైదానంలో పంజాబ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ఇషాన్ కిషన్ 41 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స‌ర్లతో 75 పరుగురు చెయ్యగా.. సూర్య‌కుమార్ యాద‌వ్‌ 31 బంతుల్లో 8 ఫోర్లు, 2సిక్స‌ర్లతో 66 రన్స్ చేశారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో ఎల్లిస్ రెండు వికెట్లు తీయ‌గా అర్ష్‌దీప్ సింగ్‌, రిషి ధావ‌న్‌లు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

మెరుపు ఇన్నింగ్స్(MI vs PBKS)

భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన ముంబైకి తొలి ఓవ‌ర్‌లోనే హిట్‌మ్యాన్‌, కెప్టెన్ రోహిత్ శ‌ర్మ డ‌కౌట్ అవ్వడం వల్ల భారీ షాక్ తగిలింది. తర్వాత బరిలోకి దిగిన ఇషాన్ కిష‌న్‌, కామెరూన్ జ‌ట్టును ఆదుకున్నారు. కానీ గ్రీన్‌ ఔట్ కావ‌డంతో స్కై మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంకేముందు అగ్నికి వాయువు తోడు అయిన‌ట్లు.. ఇషాన్ కిష‌న్‌కు సూర్య‌కుమార్ యాద‌వ్ తోడవ్వడంతో బౌండరీల వర్షం కురిసింది. దానితో ఇన్నింగ్స్ స్వ‌రూప‌మే మారిపోయింది. పోటాపోటీగా సిక్స‌ర్లు, ఫోర్లు బాదుతూ పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించారనే చెప్పాలి.

ఇషాన్‌, సూర్య‌ల జోడి మూడో వికెట్‌కు 61 బంతుల్లోనే 124 ప‌రుగులు జోడించి ముంబైని విజ‌యం దిశ‌గా న‌డిపించారు. ఇక వీరు పెవిలియన్ చేరేసరికి మైదానంలో అడుగుపెట్టిన టిమ్ డేవిడ్‌, తిలక్ వర్మ ధ్వయం మెరుపు ఇన్నింగ్స్ ఆడ‌డంతో 7 బంతులు మిగిలి ఉండ‌గానే ముంబై విజయపతాకం ఎగురవేసింది.