Rangamarthanda Movie Review : గులాబి, నిన్నే పెళ్లాడతా, సింధూరం, అంతఃపురం, ఖడ్గం తదితర చిత్రాలతో క్లాసిక్ సినిమాల దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు కృష్ణవంశీ. ఇటీవల పలు సినిమాలు డైరెక్ట్ చేసినప్పటికీ అవి ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకొని ‘రంగమార్తాండ’ మూవీతో వస్తున్నారు. మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్’కి రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్ కీలక పాత్ర పోషించారు. చాలా కాలం తర్వాత బ్రహ్మానందం ఒక వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతుండడం మరో ప్రత్యేకమైన విషయం అని చెప్పాలి. రమ్యకృష్ణ, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివాని రాజశేఖర్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇప్పటిక్ రిలీజ్ అయిన పోస్టర్, టీజర్, ట్రైలర్ లకు విశేష స్పందన లభించడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో మీకోసం ప్రత్యేకంగా..
సినిమా కథ..
రంగస్థలంపై ఎన్నో పాత్రలకి జీవం పోసి రక్తి కట్టించిన నటుడు రాఘవరావు (ప్రకాశ్‌రాజ్). నాటకరంగమే ప్రపంచంగా బతికిన ఆయనకి రంగమార్తాండ అనే బిరుదుని ప్రదానం చేస్తారు. ఆయన స్నేహితుడు చక్రపాణి (బ్రహ్మానందం) కూడా రంగస్థల నటుడే. ఇద్దరూ కలిసి దేశ విదేశాల్లో ప్రదర్శనలతో ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నవారు. జీవితంలో ఒకరి కష్టసుఖాల్లో మరొకరు పాలు పంచుకున్న వారు. రంగస్థల కళాకారుడు రాఘవరావు ప్రతిభ మెచ్చి ఆయనకు ‘రంగమర్తాండ’ బిరుదు ప్రదానం చేస్తారు. ఆ సత్కార సభలో తన రిటైర్మెంట్ ప్రకటిస్తారు. ఇష్టపడి కట్టుకున్న ఇంటిని కోడలు గీతా రంగారావు (అనసూయ) పేరు మీద రాసేస్తారు. అమ్మాయి శ్రీ (శివాత్మికా రాజశేఖర్)కు ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవ్వడమే కాదు, ప్రేమించిన అబ్బాయి రాహుల్ (రాహుల్ సిప్లిగంజ్)కు ఇచ్చి పెళ్లి చేస్తారు. శేష జీవితాన్ని సంతోషంగా గడుపుదామని అనుకుంటాడు. అక్కడి నుంచి ఆయన జీవితంలో కొత్త అంకం మొదలవుతుంది. ఆ అంకంలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? రంగస్థలంపై పోషించిన ప్రతిపాత్రనీ రక్తి కట్టించిన రాఘవరావుకి నిజ జీవితం ఎలాంటి పాత్రని ఇచ్చింది? మరి జీవిత నాటకంలో గెలిచాడా లేదా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
‘రంగమార్తాండ’లో కథలో కొత్తదనం లేదు.. కానీ ఓ జీవితాన్ని వెండితెరపై హృద్యంగా అనరు మెచ్చేలా చూపించిన తీరుకి మాటలు అయితే రావడం లేదు. ప్రస్తుత సమాజంలో జరిగే ఎన్ని విషయాల్ని ఇక్కడ ఆవిష్కరించారు. ఇంగ్లీష్ భాష మీద మోజుతో మాతృభాషను తక్కువ చేసి చూడటం, ఇంట్లో పెద్దలు చాదస్తం పేరుతో తమకు స్వేచ్ఛ ఇవ్వడం లేదని పిల్లలు భావించడం, డబ్బు విషయానికి వచ్చేసరికి కన్న తల్లితండ్రులను సైతం అనుమానించడం.. అటు సినిమాల్లో, ఇటు సమాజంలో చూస్తున్నవే. మన అమ్మానాన్నలను బతికి ఉన్నపుడు బాగా చూసుకుందామని సందేశం ఇచ్చే చిత్రమిది. నాటక రంగం నేపథ్యంలో సాగే అమ్మానాన్నల కథ ఇది. విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న కన్నవాళ్లని ఎలా చూసుకోవాలో, వాళ్లతో ఎలా మెలగాలో చెప్పే పిల్లల కథ. మొత్తంగా నేటి జీవితాల్ని ప్రతిబింబిస్తూ మనసుల్ని తడిచేసే ఓ హృద్యమైన కథ.
రీమేక్ సినిమా అయినా కూడా .. కృష్ణవంశీ తన మార్క్ తెలుగుదనం, తన మార్క్ పాత్రీకరణ, భావోద్వేగాలతో తీర్చిదిద్ది మెప్పించారు. ఇక ప్రధాన పాత్రలైన ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ నటనలో ఎంతటి ప్రావీణ్యం పొందిన వారో అందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రి గర్వించదగ్గ నటుల్లో వారు కూడా ముందు వరుసలో ఉంటారు అనడంలో సందేహం లేదు. నటులు ఒక్కొక్కరూ తమ పాత్రలకి ప్రాణం పోయగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ఇది. రాఘవరావు, చక్రపాణి తెరపై కనిపించిన కొద్దిసేపటికే.. వాళ్ల జీవితాలతో మమేకమవుతూనే, ప్రేక్షకులు ఎవరి జీవితాల్లోని సంఘటనల్ని వాళ్లు తమ తమ మనోఫలకంపై ఆవిష్కరించుకుంటూ భావోద్వేగాల ప్రయాణం చేస్తారు. థియేటర్ నుంచి బయటికొచ్చాక కూడా ఆ పాత్రలు వెంటాడుతూ వస్తుంటాయి. రంగస్థలంపై నాటకంలో ఒకొక్క భాగాన్ని ఒక్కో అంకం అని ఎలా పిలుస్తామో.. అలా రాఘవరావు జీవితంలోని రెండు ప్రధాన అంకాల్ని చూపించాడు దర్శకుడు. నాటకాల్లో చేయి తిరిగిన రాఘవరావు రంగమార్తాండ అనిపించుకుంటాడు. ఆరోజే రంగస్థలానికి స్వస్తి పలికి కొత్త జీవితాన్ని మొదలుపెడతాడు. ఇక నటన కాకుండా.. జీవిద్దాం అనుకుంటాడు. కానీ, జీవితం మాత్రం ఇదే అతి పెద్ద రంగస్థలం అని చెప్పకనే చెబుతుంది. ఆ క్రమంలో చోటు చేసుకునే సంఘర్షణే సినిమా అంతా.
జీవితమంతా నచ్చినట్టుగా బతికిన రాఘవరావు.. ఎదిగిన తన పిల్లల దగ్గర ఇమడలేక సతమతమయ్యే సన్నివేశాలు మనసుల్ని కదిలిస్తాయి. పోనీ రాఘవరావు ఏమైనా ఈతరంతో ఇమడలేని పాతకాలపు చాదస్తపు మనిషా అంటే కాదు. కళాకారుడు సమాజం కంటే ఒక తరం ముందుంటాడనే విషయాన్ని నమ్మి అందుకు తగ్గట్టుగా నడుచుకునే ఆధునిక భావాలున్న మనిషి. అలాంటి మనిషి కూడా పరిస్థితుల ప్రభావంతో సంఘర్షణకి గురయ్యే వైనం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ఇటు తల్లిదండ్రులు, అటు పిల్లలు.. తరాలకి తగ్గట్టుగా ఎవరి ఆలోచనలు వాళ్లవి. ఎవరినీ తప్పు పట్టలేం. అలాంటి పరిస్థితుల మధ్యే సంఘర్షణని సృష్టించడంలో కృష్ణవంశీ విజయం సాధించారు. షేక్‌స్పియర్ నాటకాలతో పోల్చి తెలుగు నాటకరంగాన్ని తక్కువ చేసి మాట్లాడే సందర్భంలో సన్నివేశాలు సినిమాకి హైలైట్. పతాక సన్నివేశాల్లో ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ కలిసి రోడ్డు పక్కన నిదురపోయే సన్నివేశాలు మనసుల్ని బరువెక్కిస్తాయి. రాఘవరావు సన్నిహితుడు చక్రపాణి (బ్రహ్మానందం) జీవితం కూడా కథకి కీలకం. భర్త చాటు భార్యగా బతుకుతున్న రాజుగారు (రమ్యకృష్ణ) తన భర్తకి అవమానం ఎదురైనప్పుడు ఆమె పడే వేదన, ఆస్పత్రిలో ప్రకాశ్‌రాజ్ – బ్రహ్మానందం మధ్య సన్నివేశాలు సినిమాకి ఆయువుపట్టుగా నిలిచాయి. మనసుల్ని తడిచేసి, హృదయాల్ని మెలిపెట్టి.. కన్నీరు పెట్టించే అతికొద్ది చిత్రాల్లో ఇది కూడా ఒకటి.
ఎవరెలా చేశారంటే..
ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ.. ఈ ముగ్గురూ సినిమాకి మూలస్తంభాలు. ప్రకాశ్‌రాజ్ చాలా రోజుల తర్వాత ఓ బలమైన పాత్రలో కనిపిస్తారు. తనకున్న అనుభవంతో ఆ పాత్రని రక్తికట్టించారు. పద్యాలు, ఆంగ్ల సంభాషణలు, అచ్చ తెలుగు మాటల్ని చెబుతూ ఆ పాత్రకి మరింత వన్నె తీసుకొచ్చాడు. ప్రకాశ్‌రాజ్ తప్ప మరొకరు చేయలేరనిపించేలా ఉంటుంది రాఘవరావు పాత్ర. బ్రహ్మానందంలోని కొత్త కోణం ఇందులో కనిపిస్తుంది. ఆయన పేరు చెప్పగానే కామెడీ పాత్రలే గుర్తొస్తాయి. కానీ ఆయన ఇందులో హృదయాల్ని బరువెక్కించేలా నటించి ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తారు. రమ్యకృష్ణ ఎక్కువ సంభాషణలు లేకుండా.. కళ్లతోనే భావోద్వేగాలు పలికించే పాత్రని చేసింది. రాజుగారూ అంటూ ఆమెను ప్రకాశ్‌రాజ్ సంబోధించడం, వాళ్లిద్దరి మధ్య అన్యోన్యతని చూస్తే సగటు ప్రేక్షకుడికి వాళ్ల తల్లిదండ్రులు గుర్తుకురాక మానరు.
శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ, ఆదర్శ్, అలీ రెజా నేటితరం పాత్రల్లో ఒదిగిపోయారు. ఆయా పాత్రలపై బలమైన ప్రభావమే చూపించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ఇళయరాజా సంగీతం సినిమాకి ప్రధాన బలం. పాటలు, నేపథ్య సంగీతం కథలో భాగంగా సాగుతాయి. కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఆకెళ్ళ శివప్రసాద్ మాటలు సినిమాకి మరో హైలైట్. నాటకం, జీవితం, సినిమాలపై ఎంతో అవగాహన ఉంటే తప్ప అలాంటి మాటలు రాయలేరు. సినిమా ఆరంభంలో లక్ష్మీభూపాల్ రచనలో చిరంజీవి చెప్పిన షాయిరీ ఆకట్టుకుంటుంది. దర్శకుడు కృష్ణవంశీ మేకింగ్‌లో ఆయన పట్టుని, అనుభవాన్ని రంగరించి మరో గుర్తుండిపోయే చిత్రాన్ని తెరకెక్కించారు.
కంక్లూజన్..
జీవించి ఏడిపించేశారు.. ఇది కదా కృష్ణవంశీ నుంచి కోరుకునేది..