Karnataka Elections: కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న బ్రహ్మానందం.. ఏ పార్టీ తరపునో తెలుసా?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకకు చేరుకుంటోంది. ఎన్నికలకు వారం రోజులు కూడా లేకపోవడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని విస్తృతం చేశాయి.

Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 10 న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మరం చేశాయి. అధికార బీజేపీ, కాంగ్రెస్ ,జేడీఎసఖ్ మూడు పార్టీలు పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. మరో సారి అధికారం చేపట్టాలని బీజేపీ.. ఈ ఎన్నికల్లో విజయం సాధించి తమ ఉనికి చాటు కోవాలని కాంగ్రెస్, ఎన్నికల్లో సత్తా చాలి కింగ్ మేకర్ అవ్వాలని జేడీఎస్ లు ప్రయత్నం చేస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో చెట్లకు నోట్లు కాస్తుండగా.. మరో వైపు ప్రచారంలో సినీ తారలను తీసుకొచ్చ ఓటర్లను ఆకట్టు కునేందుకు అన్ని పార్టీలు ప్రచారం చేపట్టారు.

 

ప్రచారంలో సినీ తారలు(Karnataka Elections)

కాగా, కర్ణాటక ఎన్నికల ప్రచారంలో సినీ తారలు మెరుస్తున్నారు. ఇప్పటికే బీజేపీ తరపున కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ప్రచారం చేస్తున్నారు. మరో వైపు రాహుల్ గాంధీ ప్రచారంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ పాల్గొని కాంగ్రెస్ కు మద్దతు తెలిపారు. తాజాగా మరో నటుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన ఎవరో కాదు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం.

క్యాంపెన్ లో బ్రహ్మానందం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మానందం ప్రచారం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీకి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ప్రస్తుతం కర్ణాటక మంత్రిగా ఉన్న కే సుధాకర్ తరఫున బ్రహ్మానందం క్యాంపెన్ లో పాల్గొన్నారు. చిక్కబళ్లాపూర్‌ బీజేపీ అభ్యర్థి సుధాకర్‌కు మద్దతు తెలుపుతూ ఆయనకు ఓటేయాలంటూ ఓటర్లను కోరారు. . రోడ్డు షో ద్వారా ప్రజలతో సందడి చేశారు. అంతేకాకుండా ఈ నియోజక వర్గంలో చాలా మంది తెలుగు వారు ఉన్నారు. ఈ క్రమంలో ఆయన వారితో మమేకమై తెలుగులో మాట్లాడారు.

2019 లో ఉప ఎన్నికల సందర్భంగా ఇదే నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా నిలబడిన డాక్టర్ సుధాకర్ తరపున బ్రహ్మానందం ప్రచారం నిర్వహించారు. సుధాకర్ తనకు మిత్రుడని.. అందుకే ఎన్నికల ప్రచారానికి వచ్చానంటూ నాడు బ్రహ్మానందం తెలిపారు. ప్రచారంలో తెలుగు సినిమా డైలాగ్స్ చెబుతూ ఉత్సాహం నింపారు. తర్వాత ఆ ఎన్నికల్లో సుధాకర్ విజయం సాధించి మంత్రి కూడా అయ్యారు.

 

ముఖ్యనేతలంతా అక్కడే

కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకకు చేరుకుంటోంది. ఎన్నికలకు వారం రోజులు కూడా లేకపోవడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని విస్తృతం చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ, మల్లిఖార్చున ఖర్గేతో సహా అన్ని పార్టీల ముఖ్య నేతలంతా రాష్ట్రంలోనే మకాం వేశారు. మూడుపార్టీల పోరుతో కర్ణాటకలో గెలుపెవరిదనేది ఉత్కంఠగా మారింది.