Site icon Prime9

Karnataka Elections 2023 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. పలువురు ప్రముఖులు ఏమన్నారంటే ?

interesting details about karnataka elections 2023

interesting details about karnataka elections 2023

Karnataka Elections 2023 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బరిలో ఉన్న 2,165 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని  5.31 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. ఈ క్రమంలోనే ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఈ మేరకు వారి వారి శైలిలో మనసులోని మాటలని బయటపెట్టారు.

ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ ..

పెద్ద ఎత్తున ఓటింగ్‌లో కర్ణాటక ఓటర్లు పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కర్నాటక ప్రజలు, ముఖ్యంగా యువకులు, మొదటిసారి ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను సుసంపన్నం చేయాలని అన్నారు. అదేవిధంగా పంజాబ్‌లోని పార్లమెంట్ స్థానానికి, మేఘాలయ, ఒడిశా, యూపీలో అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా నియోజకవర్గాల ఓటర్లు తమ ఓటు హక్కును అధిక సంఖ్యలో వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.

 

అమిత్ షా విజ్ఞప్తి..

పోలింగ్ రోజున, కర్ణాటకలోని మా సోదరులు, సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాష్ట్రంలో సుపరిపాలన, అభివృద్ధి, శ్రేయస్సు కోసం ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాను. మీ ఒక్క ఓటు రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తున్న ప్రజానుకూలమైన, ప్రగతిశీల ప్రభుత్వాన్ని నిర్ధారిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్..

ప్రజాస్వామ్య పండుగలో అధిక సంఖ్యలో పాల్గొనాలని కర్ణాటక ఓటర్లకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విజ్ఞప్తి చేశారు. కర్ణాటక భవిష్యత్తును నిర్ణయించడంలో ఈ ఎన్నికలు కీలకం. రాష్ట్ర ప్రగతికి కొనసాగింపుని అందించే, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్ ..

కర్ణాటక ప్రజలు ప్రగతిశీలమైన, పారదర్శకమైన సంక్షేమ ఆధారిత ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారు. నేడు పెద్ద సంఖ్యలో ఓటు వేసే సమయం వచ్చింది. మెరుగైన భవిష్యత్తు కోసం ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనడానికి మొదటి సారి ఓటర్లను మేము స్వాగతిస్తున్నాము అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

ఎమ్మెల్సీ కవిత పిలుపు..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విటర్ ద్వారా ఆ రాష్ట్ర ప్రజలకు సూచన చేశారు. ప్రియమైన కర్ణాటక, ద్వేషాన్ని తిరస్కరించండి! సమాజం మరియు ప్రజల అభివృద్ధి, శ్రేయస్సు కోసం ఓటు వేయండి అంటూ పిలుపునిచ్చారు.

ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందు ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

కర్ణాటక మంత్రి సీఎన్ అశ్వత్ నారాయణ్ బెంగళూరులో ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై మాట్లాడుతూ.. ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి అభివృద్ధిని చూసి ఓటేయాలని కోరారు. షిగావ్ నుంచి బరిలో ఉన్న బొమ్మై ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందు హుబ్బళిలోని హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు.

యడియూరప్ప మాట్లాడుతూ.. షికారిపుర నుంచి తొలిసారి బరిలోకి దిగిన విజయేంద్ర 40 వేల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ఓటు వేసిన అనంతరం చెప్పారు.

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య సుధామూర్తితో కలిసి ఉదయాన్నే బెంగళూరులోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని క్యూలో నిల్చుని ఓటేశారు. ఈ సందర్భంగా సుధామూర్తి మాట్లాడుతూ.. తాము ఈ వయసులో ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి వచ్చి క్యూలో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నామని, తమ నుంచి నేర్చుకుని యువత కూడా ముందుకొచ్చి తమ (Karnataka Elections 2023)  ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, బీజేపీ నేత నిర్మలా సీతారామన్ బెంగళూరులో ఓటు వేశారు.

కన్నడ నటి అమూల్య, ఆమె భర్త బెంగళూరులోని ఆర్ఆర్ నగర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

నటుడు గణేశ్ భార్యతో కలిసి ఆర్ఆర్ నగర్‌లో ఓటు వేశారు.

కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర కుటుంబ సభ్యులతో కలిసి తీర్థహళ్లిలో ఓటు వేశారు.

మరో మంత్రి కె. సుధాకర్ చిక్కబళ్లాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మరో మంత్రి, కనకపుర బీజేపీ అభ్యర్థి ఆర్.అశోకా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

Exit mobile version