Ahimsa Movie Review : దగ్గుబాటి రామానాయుడు కుటుంబం నుంచి కొత్త కథానాయకుడు టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. నిర్మాత సురేష్ బాబు రెండో తనయుడు, రానా తమ్ముడు అభిరామ్ హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ తెరకెక్కించిన సినిమా ‘అహింస’. గీతిక హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో రజత్ బేడి, సదా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి.కుమార్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోండగా, ఆర్పీ పట్నాయక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులను.. ముఖ్యంగా యూత్‌ను బాగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమాలోని సాంగ్స్‌కు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సినిమాను గతంలో ఏప్రిల్ 7న వేసవి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడి నేడు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యింది.
సినిమా కథ..
రఘు (దగ్గుబాటి అభిరామ్) అహింసావాది. చీమకు కూడా హాని తలపెట్టని యువకుడు. రఘు అంటే అతని మరదలు అహల్య (గీతికా తివారి)కి చచ్చేంత ప్రేమ. వాళ్ళిద్దరికీ నిశ్చితార్థమైన రోజు ఆమెపై ధనలక్ష్మి దుష్యంత రావు (రజత్ బేడీ) కుమారులు ఇద్దరు దారుణంగా అత్యాచారానికి పాల్పడతారు. మరదలిపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తులకు శిక్ష పడాలని రఘు కేసు పెడతాడు. అతనికి లాయర్ లక్ష్మీ (సదా) సహాయం చేస్తుంది. అయితే, ఆమె కుటుంబాన్ని ధనలక్ష్మి దుష్యంత రావు చంపేస్తాడు. అతడి బలం ముందు కేసు నిలబడదని రఘుకి అర్థం అవుతుంది. అప్పుడు అతడు ఏం చేశాడు? అహింసా వాదం వదిలి హింస వైపు వచ్చాడా? లేదా? ధనలక్ష్మి దుష్యంత రావు కనపడకుండా పోవడానికి కారణం ఏమిటి ? అభిరామ్ ప్రయాణంలో అడవుల్లో గంజాయి సాగు చేసే లుంబ్డి గ్యాంగ్ పాత్ర ఏమిటి? అనేది మిగతా సినిమా.
మూవీ విశ్లేషణ (Ahimsa Movie Review)..
ప్రతి దర్శకుడికి ఒక శైలి ఉంటుంది. తొలుత అది కొత్తగా ఉంటుంది. రాను రాను ప్రతి సినిమాను అదే శైలిలో తీస్తే చూసే ప్రేక్షకులకు విసుగు వస్తుంది. తేజ విషయంలోనూ అదే జరుగుతోంది. ఆయన ఎంపిక చేసుకున్న కథలో విషయం ఉంది. అహింసావాది హింస వైపు వెళ్ళడం అనేది ఆసక్తి కలిగించే అంశమే. కానీ ఆ ఆసక్తి సినిమాలో లేదు. విశ్రాంతి వరకు సినిమా సోసోగా అనిపిస్తుంది. ఆ తర్వాత కథలో వేగం పెరుగుతుందని ఆశిస్తే మరింత నీరసంగా ముందుకు వెళుతుంది.
‘నేనే రాజు నేను మంత్రి’తో తేజ మళ్ళీ ఫామ్ అందుకున్నారని ఫ్యాన్స్ సంబరపడ్డా.. తర్వాత ‘సీత’తో ఫ్లాప్ అందుకున్నారు. ఇప్పుడు ‘అహింస’ చూశాక మళ్ళీ తేజ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతారని పబ్లిక్ అభిప్రాయపడుతున్నారు. ఇంటర్వెల్ తర్వాత ఐటమ్ సాంగ్ ఏంటి అని.. కొత్తగా తీసే తేజ.. ఎందుకు కమర్షియల్ కొలతలతో మూవీ తీశారని అనుకుంటున్నారు. లాజిక్స్ గురించి తక్కువ మాట్లాడుకుంటే మంచిది.
కథ, కథనాలు ఎలా ఉన్నప్పటికీ.. ఆర్పీ పట్నాయక్ సంగీతం పర్వాలేదు. పాటలు ఓకే అనిపిస్తాయి. చంద్రబోస్ మంచి సాహిత్యం అందించారు. విజువల్స్ బావున్నాయి. ప్రొడ్యూసర్ ఖర్చుకు వెనుకాడలేదు అని మాత్రం తెలుస్తుంది.
ఎవరెలా చేశారంటే..
అభిరామ్ తొలి చిత్రమిది. ఆయన నటనలో ఓనమాలు దిద్దుతూ ఉన్నారు. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఆ విషయం తెలుస్తుంటుంది. దర్శకుడు తేజ కూడా ఆయనకు ఎక్కువ శ్రమ కల్పించలేదు. వీలైనంత వరకు హీరో మీద భారం పడకుండా సన్నివేశాలు రూపొందించారు. కొన్ని సన్నివేశాల్లో అభిరామ్ తప్పకుండా నటించాల్సిన పరిస్థితి. తన శక్తి మేరకు అభిరామ్ నటించారు. ఆయన నటన గొప్పగా ఉందని చెప్పలేం. మొదటి సినిమాకు ఓకే.
హీరోయిన్ గీతికా తివారికి తెలుగులో తొలి చిత్రమిది. ఇంతకు ముందు తమిళ సినిమా ‘లెజెండ్ శరవణన్’లో నటించారు. నటిగా ఆమె చక్కటి పెర్ఫార్మన్స్ చేశారు. కాస్త అందాల ప్రదర్శన కూడా చేశారు. మంచి కథలు, క్యారెక్టర్లు పడితే ఆమెకు భవిష్యత్ ఉంటుంది. లాయర్ లక్ష్మి పాత్రలో సదా ఓకే. రవి కాలె సహా మిగతా ఆర్టిస్టులు అందరూ ఓవర్ యాక్టింగ్ చేసినట్లు అనిపించారు.
కంక్లూజన్..
సినిమాకి వెళ్ళిన వారికి టైటిల్ లో ‘అ’ మిస్ అవ్వడం ఖాయం అని టాక్..