Amarnath Yatra: జమ్మూ కశ్మీర్ లోని సుప్రసిద్ధమైన అమర్‌నాథ్ యాత్రకు వెళ్లేందుకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. దక్షిణ కశ్మీర్‌లోని ఈ యాత్ర ఈసారి జులై 1న ప్రారంభమై ఆగస్టు 31 వరకు సాగనుంది. మొత్తం 62 రోజుల పాటు సాగే ఈ యాత్రలో పాల్గొనేందుకు యాత్రికులు రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంది. అమర్‌నాథ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు బ్యాంకు శాఖల్లోనూ రిజిస్ట్రర్ అవ్వొచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన 316 శాఖల్లో అమర్ నాథ్ యాత్రకు సంబంధించిన ప్రక్రియ మొదలైందని ఆ బ్యాంకు చీఫ్ మేనేజర్ తెలిపారు. గతేడాది వరకు యాత్రికులకు మాన్యువల్‌గా ఫాంలు ఇచ్చారని.. ఇప్పుడు సిస్టమ్ జెనరేటెడ్ ఫాంలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ యాత్రలో పాల్గొనాలనుకొనే యాత్రికులు తమ ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలను పొందుపర్చడం తప్పనసరి అన్నారు.
మరోవైపు, జమ్మూలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ శాఖను పుష్పాలతో అందంగా ముస్తాబు చేశారు. ఈ రోజు నుంచే రిజిస్ట్రేషన్లు మొదలవ్వడంతో బ్యాంకుకు పెద్ద సంఖ్యలో యాత్రికులు పేర్ల నమోదుకు చేసుకొనేందుకు వచ్చారు. ఈ సంవత్సరం అమర్ నాథ్ యాత్ర కూడా రెండు మార్గాల ద్వారా కొనసాగనుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో పూజలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. తమ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు దేశవ్యాప్తంగా 542 బ్యాంకు శాఖల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.
హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తున ఉన్న అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర వార్షిక యాత్ర కోసం ఈ ఏడాది రిజిస్ట్రేషన్ లో కొత్త రూల్ ను తీసుకొచ్చారు. యాత్రలో పాల్గొనబోయే యాత్రికులు కచ్చితంగా ఆధార్ లో రిజిస్ట్రర్ చేయించి వేలిముద్ర స్కాన్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఈ యాత్ర సంబంధించి కొన్ని మార్గదర్శకాలను అధికారులు జారీ చేశారు. 13 ఏళ్లలోపు పిల్లలను, 75 ఏళ్లు పైబడిన వృద్ధులను యాత్రకు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య ధ్రువ పత్రాన్ని పొందుపర్చాలి. 6 వారాలకు పైబడిన గర్భిణీలు ఈ అమర్ నాథ్ యాత్రలో పాల్గొనడానికి అనుమతి లేదు. అమర్ నాథ్ గుహలోని శివలింగాన్ని దర్శించుకునేందుకు ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు దేశ నలుమూల నుంచి తరలి వెళ్తారు. ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.