Last Updated:

Magunta Srinivasulu Reddy: ఈడీ విచారణకు హాజరుకాని వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట

ఈడీ నోటీసుల నేపథ్యంలో మాగుంట శ్రీనివాసుల రెడ్డి శనివారం ఉదయం 10 గంటలకే విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ.. సాయంత్రం వరకూ కూడా ఈడీ కార్యాలయానికి చేరుకోలేదు.

Magunta Srinivasulu Reddy: ఈడీ విచారణకు హాజరుకాని వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట

Magunta Srinivasulu Reddy: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఈడీ విచారణకు హాజరు కాలేదు. మద్యం కుంభకోణం కేసులో శనివారం ఆయన

వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఈ మేరకు ఈ నెల 16న ఈడీ నోటీసులు జారీ చేసింది.

ఈడీ నోటీసుల నేపథ్యంలో మాగుంట శ్రీనివాసుల రెడ్డి శనివారం ఉదయం 10 గంటలకే విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ.. సాయంత్రం వరకూ కూడా ఈడీ కార్యాలయానికి చేరుకోలేదు.

అధికారులకు కూడా ఎలాంటి అధికారిక సమాచారం అందించలేదు. అయితే, మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఢిల్లీలోనే ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

 

సమాచారం లేకుండా..(Magunta Srinivasulu Reddy)

మాగుంట ఈడీ విచారణకు వస్తున్నారా? లేదా? అనేది ఆయన తరఫున న్యాయవాదులను విచారణకు పంపిస్తున్నారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

కాగా, విచారణకు హాజరుకాలేనని.. మరో తేదీ కేటాయించాలని కూడా శ్రీనివాసుల రెడ్డి నుంచి ఈడీ అధికారులకు ఎలాంటి సమాచారం కూడా రాలేదు.

ఈ రోజు మాగుంట విచారణకు హాజరైతే.. ఇతర నిందితులు బుచ్చిబాబు, అరుణ్‌ పిళ్లైతో కలిసి ప్రశ్నించాల్సి ఉంది.

శ్రీనివాసులు హాజరుకాకపోవడంతో ఇతర నిందితులను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, మాగుంట శ్రీనివాసుల రెడ్డి విచారణపై ప్రస్తుతం సస్పెన్స్‌ కొనసాగుతోంది.

రాఘవకు కస్టడీ పొడిగింపు

మరో వైపు లిక్కర్ స్కామ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి జ్యుడిషియల్ కస్టడీని పొడిగించారు.

నేటితో కస్టడీ గడువు పూర్తవడంతో రాఘవను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఈడీ వాదనలు వినిపించింది.

మద్యం కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ నెల 28వ తేదీ వరకు రాఘవరెడ్డి జ్యడిషియల్‌ కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఏడాది ఫిబ్రవరి 10న రాఘవను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం రాఘవ తిహార్ జైలులో ఉన్నారు.