Rohit Sharma: బోర్డర్- గవాస్కర్ ట్రోఫిలో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ.. మరో రికార్డును సొంతం చేసుకున్నారు. భారత్ క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్ కు సాధ్యం కాని రికార్డును రోహిత్ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు. నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆటలో రోహిత్ ఈ రికార్డును అందుకున్నాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన పరుగుల దాహం తీర్చుకున్నాడు. రెండో రోజు ఆటలో.. తన పేరు మీద సరికొత్త రికార్డును లిఖించుకున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ కెప్టెన్‌కూ సాధ్యం కాని అరుదైన రికార్డును టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. నెలకొల్పాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా.. రెండో రోజు ఆటలో సెంచరీ సాధించిన రోహిత్.. మరో మైలురాయిని చేరుకున్నాడు. కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా నాలుగో కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇప్పటివరకు కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన రికార్డు ముగ్గురి పేరిట ఉంది. మెుదట.. శ్రీలంక మాజీ కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్ ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత.. సౌతాఫ్రికా మాజీ సారధి ఫాఫ్ డుప్లెసిస్.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ కెప్టెన్లుగా ఈ ఘనత సాధించారు. తాజాగా రోహిత్ (Rohit Sharma) వీరి సరసన చేరాడు.
రోహిత్ శర్మ ఇప్పటి వరకు తన కెరీర్ లో కెప్టెన్‌గా వన్డే, టీ20ల్లో మాత్రమే సెంచరీలు చేశాడు. టెస్ట్ జట్టు కెప్టెన్‌గా ఈ మ్యాచ్ లో హిట్‌మ్యాన్ సాధించిన తొలి సెంచరీ ఇదే. ఈ సెంచరీతో రోహిత్.. భారత దిగ్గజ కెప్టెన్లు గంగూలీ, ధోని, కోహ్లిVirat Kohli లకు సాధ్యంకాని రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో రెండేళ్ల తర్వాత రోహిత్ సెంచరీ సాధించాడు. ఇది రోహిత్ కెరీర్లో 9వ టెస్ట్ శతకం. ఈ సెంచరీ పూర్తి చేసేందుకు.. 171 బంతులు ఆడిన రోహిత్ 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అంతర్జాతీయ కెరీర్లో 43వ శతకాన్ని పూర్తి చేశాడు.
ఈ మ్యాచ్‌లో రోహిత్ ఇన్నింగ్సే హైలైట్. ఓపెనర్‌గా బరిలోకి దిగిన హిట్‌మ్యాన్ ఓ పక్క వికెట్లు పడుతున్నా.. ఒంటరిగా బ్యాటింగ్ కొనసాగిస్తూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇతర ఆటగాళ్లు.. పుజారా, కోహ్లి, సూర్యకుమార్ తక్కువ స్కోర్లకే ఔటైనా.. రోహిత్ ధైర్యంగా బ్యాటింగ్ కొనసాగించాడు. అనంతరం 212 బంతుల్లో 120 పరుగులు చేసిన రోహిత్.. కమిన్స్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఇందులో 15 ఫోర్లు.. రెండు సిక్సర్లు సాధించాడు. ప్రస్తుతం భారత్ ఆధిక్యంలో దూసుకుపోతుంది.
అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా 5 వికెట్లతో ఆసీస్ ను కుప్పకూల్చాడు.