Australia vs India 1st Test Border Gavaskar Trophy: ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా భారత్ టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. దీంతో భారత్ 150 పరుగులకే ఆలౌట్ అయింది. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి(41) పరుగులతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
ఓపెనర్ యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్ డకౌట్‌గా వెనుదిరిగారు. విరాట్ కోహ్లీ కేవలం 5 పరుగులకే కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తర్వాత పంత్(37), రాహుల్(26) నిలకడగా ఆడారు. కానీ రాహుల్ అనూహ్యంగా ఔట్ కావడంతో నిరాశకు గురిచేసింది. తొలుత అంపైర్ నాటౌట్‌గా పరిగణించినా డీఆర్ఎస్‌లో ఔట్ ఇచ్చారు.
డీఆర్ఎస్‌లో బ్యాట్ బంతిని తాకినట్లు స్పష్టంగా లేదు. అయితే ఈ సమయంలో ప్యాడ్‌ను బ్యాట్ తగలడంతో తాకినట్లు స్పైక్స్ వచ్చాయి. దీంతో థర్డ్ అంపైర్ ఔట్‌గా పరిగణించాడు. తర్వాత ధ్రువ్ జురెల్(11), సుందర్(4), హర్షిత్ రాణా(7), బుమ్రా(8) పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్ వుడ్ 4 వికెట్లు పడగొట్టగా.. కమిన్స్, మార్స్, స్టార్క్ తలో రెండు వికెట్లు తీశారు.
తర్వాత బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా తడబడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కేవలం 38 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఉస్మాన్ ఖవాజా(8), నాథన్ మెక్ స్వీనీ(10), స్టీవెన్ స్మిత్(0), ట్రావిస్ హెడ్(11), మిచెల్ మార్ష్(6) విఫలమయ్యారు. ప్రస్తుతం మార్నస్ లుబుషేన్(2), అలెక్స్ కారీ(3) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్ తలో వికెట్ తీశారు.