CCL 2023: సినిమా, క్రికెట్ ఈ రెండంటే అభిమానులకు పిచ్చి. సినిమా అన్నా, క్రికెట్ అన్నా చూడటానికి అభిమానులు ఎదురు చూస్తారు. ఈ రెండింటికి విపరీతమైన అభిమానులు ఉంటారు. ఇప్పుడు ఈ రెండే ఒకటై వస్తున్నాయి. అదేనండి.. మన అభిమాన హీరోలు.. నటులు బ్యాటు పట్టుకొని స్టేడియంలోకి రాబోతున్నారు. చాలా రోజుల తర్వాత.. మళ్లీ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ రాబోతుంది. దీంతో అభిమానులు ఈ పండగ కోసం ఎదురు చూస్తున్నారు.
పాన్ ఇండియా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుంది. దేశంలోని ఎనిమిది చలన చిత్ర పరిశ్రమలకు చెందిన నటులు ఈ లీగ్ లో పాల్గొననున్నారు. ఈ మేరకు ముంబయిలో కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ లీగ్లో మొత్తం ఎనిమిది జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లకు రాయ్పూర్, బెంగళూరు, హైదరాబాద్, జోధ్ పూర్, త్రివేండ్రం, జైపూర్ నగరాలు ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. వీరితో పాటు.. ఇతర నటులు హీరోయిన్లు మైదానాల్లో సందడి చేయనున్నారు. కరోనా కారణంగా.. మధ్యలు ఈ లీగ్ జరగలేదు. చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి.
మెుత్తం 8 చలనచిత్ర పరిశ్రమలకు చెందిన జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. ఇక ప్రతి టీం ఇప్పటికే తమ కెప్టెన్ లను ప్రకటించాయి. ముంబై హీరోస్ జట్టుకు.. రితేష్ దేశ్ ముఖ్ కెప్టెన్ గా ఉన్నాడు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. చెన్నై రైనోస్ జట్టుకి ఆర్య కెప్టెన్గా కొనసాగుతున్నాడు. ఇక తెలుగు వారియర్స్ టీం కు అఖిల్ కెప్టెన్ గా ఉన్నాడు. ఇదే జట్టుకు విక్టరీ వెంకటేష్ కో ఓనర్ గా ఉన్నాడు. భోజ్పురి దబాంగ్స్ జట్టుకు మనోజ్ తివారీ నేతృత్వం వహిస్తున్నాడు. కేరళ స్ట్రైకర్స్ టీంకి.. కుంచాకో బోపన్.. బెంగాల్ టైగర్స్ టీంకి జిసుసేన్ గుప్త కెప్టెన్ గా ఉన్నారు. ఇక కర్ణాటక బుల్డోజర్స్ టీమ్ కి కిచ్చ సుదీప్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. పంజాబ్ దే షేర్ టీంకి సోనూసూద్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.
ఈ క్రికెట్ పోటీలను జీ నెట్ వర్క్ ప్రసారం చేయనుంది. జీ అన్మోల్ సినిమా ఈ మొత్తం మ్యాచ్ లను ప్రసారం చేయనుంది. తెలుగు వారియర్స్ మ్యాచ్ లను జీ సినిమా ప్రసారం చేయనుంది. ఇక ఈ లీగ్ లో
120 మందికి పైగా సినీ ప్రముఖులు పాల్గొంటున్నారు. అన్ని టీమ్స్ లోను ఆయా సినీ పరిశ్రమకి చెందిన నటులు ఆడనున్నారు. ఇక ఈ మ్యాచ్ లకు అనేకమంది సినీ, టీవీ సెలబ్రిటీలు సైతం హాజరు కానున్నారు. సినీ, క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్ ల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.