America: అమెరికా శీతాకాలపు మంచు తుఫాన్ తో వణికిపోతోంది.దేశవ్యాప్తంగా కురుస్తున్న విపరీతమైన మంచు, ఎముకలు కొరికే చలితో కోట్లాది మంది అల్లాడిపోతున్నారు. ఇప్పటివరకూ 48 మంది మృతి చెందారు. న్యూయార్క్ స్టేట్ లోని బఫెలో సిటీలో రికార్డ్ స్థాయిలో ఒక్క రోజులోనే 22.3 అంగుళాల మంచు కురిసింది. ఇక్కడ 27 మంది చనిపోయారు. హైవేలన్నీ క్లోజ్ అయ్యాయి. వేలాది విమానాలు ఎయిర్ పోర్టుల్లోనే ఆగిపోయాయి. మంచు తుఫాన్ కారణంగా 15 లక్షలకుపైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారంలో మగ్గాల్సివచ్చింది. అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పైపుల్లో నీరు సైతం గడ్డకట్టడంతో నీటి సరఫరా కూడా ఆగిపోయింది. ఏటా ఈ సీజన్ లో సాధారణ ఉష్ణోగ్రతలు ఉండే దక్షిణాది రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత పెరిగి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
యూఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ రిపోర్ట్ ప్రకారం శుక్రవారం దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత మైనస్ -48 డిగ్రీల దాకా పడిపోయింది. మంచు తుఫాన్ వల్ల ఇప్పటివరకూ 34 మంది చనిపోయారు. దాదాపు 20 కోట్ల మందికిపైగా ప్రజలపై ప్రభావం పడింది. విద్యుత్ సరఫరా లేక, బయటకు వెళ్లలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచు తుఫాన్ కొనసాగుతూ.. ఇరవై నాలుగు గంటలపాటు నిరంతరం ప్రెజర్ డ్రాప్ అయిపోతే దానిని ‘బాంబ్ సైక్లోన్’గా పిలుస్తారు. బాంబ్ సైక్లోన్ పరిస్థితి ఏర్పడితే భారీ వర్షాలు లేదా విపరీతంగా మంచు వర్షం కురుస్తుంది. తీర ప్రాంతాల్లో వరదలూ సంభవిస్తాయి. బాంబ్ సైక్లోన్ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో హరికేన్ తుఫాన్ స్థాయిలో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ప్రస్తుత బాంబ్ సైక్లోన్ వల్ల లేక్ ఇరీలో 8 మీటర్ల మేరకు వేవ్స్ వస్తున్నాయని కెనడాలోని టొరంటోకు చెందిన మెటియోరాలజిస్ట్ కెల్సీ మెక్ ఎవెన్ ట్వీట్ చేశారు. ఓహియోలోని ఫైర్ పోర్ట్ హార్బర్ వద్ద గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయని నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకటించింది. వందలాది విమాన సర్వీసులను రద్దు చేసారు.
అమెరికాలోని కెంటకీ స్టేట్ లోని గ్లాస్గోలో, మోంటానా స్టేట్ లో రాత్రికి రాత్రే ఉష్ణోగ్రత మైనస్ 48 డిగ్రీలకు పడిపోయాయి. ఇక్కడ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ అధికారి రిచ్ మలియావ్ కో హెచ్చరించారు. చలి నుంచి రక్షణ కోసం జాకెట్లు, గ్లౌజ్ ల వంటివి వాడాలని, లేకపోతే చర్మాన్ని ఐదు నిమిషాల్లోనే మంచు కొరికేస్తుందన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నీళ్లు పైపుల్లోనే గడ్డకడుతున్నాయి. మరిగే నీళ్లు సైతం గాలిలోకి విసిరేస్తే గడ్డకడుతున్నాయి. దీంతో అనేక మంది మరిగే నీటిని విసిరి.. నీళ్లు గడ్డ కడుతుండటాన్ని వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు. ‘బాయిలింగ్ వాటర్ చాలెంజ్’ అంటూ సోషల్ మీడియాలో సవాల్ విసురుతున్నారు. ఇక మెక్సికో నుంచి టెక్సాస్ కు వలస వచ్చిన వాళ్లు చర్చిలు, స్కూళ్లు, ఇతర షెల్టర్లలో తలదాచుకుంటున్నారు.