Lock Down in Islamabad: మళ్లీ లాక్‌డౌన్.. పాక్‌లో ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు
Islamabad Under Lockdown Ahead Of Massive PTI Protest Over Imran Khan’s Release: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. పలు రాజకీయ కారణాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దేశ వ్యాప్తంగా తెహ్రీక్ ఏ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పీఎం షెహబాజ్ షరీఫ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
బెలారస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకషెంకో పర్యటనకు వస్తున్న వేళ నిరసనలు మొదలయ్యాయయి. ఈ నేపథ్యంలో ఆందోళన చెందిన ప్రభుత్వం నగరమంతా లాక్ డౌన్ చేసి సైన్యం మోహరించింది. దీంతో లాక్‌డౌన్ మళ్లీ పడినట్లయింది. అయితే ఎవరూ బయటకు రావొద్దని, ఎవరైనా బయటకు వస్తే కఠినమైన ఆంక్షలు ఉంటాయని వెల్లడించింది.
ఇదిలా ఉండగా, కొంతమంది నిరసనకారులు మాజీ పీఎం, పీటీఐ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేసేంత వరకు దర్నా కొనసాగిస్తామని సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేశారు. దీంతో పాకిస్థాన్ ప్రభుత్వం అలర్ట్ అయింది. వెంటనే పోలీసులు ఇస్లామాబాద్ నగరమంతా బందోబస్తు చేపట్టారు. దాదాపుగా అన్ని వైపులా రోడ్లపై మోహరించి బారికేడ్లను అమర్చారు.
అయితే, ఇస్లామాబాద్‌లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఖైబర్ పంఖ్తుంక్వా సీఎం అలీ అమీన్ పిలుపునిచ్చారు. దీంతో నగరంలోని రెడ్ జోన్ పరిధిలో ఉన్న డీ చౌక్ ఎంట్రన్స్ వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే అన్ని ప్రధాన నగరాల్లో అల్లర్లను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులతో పాటు పారా మిలటరీ బలగాలు మోహరించాయి. మరోవైపు, సిగ్నల్ రాకుండా సెల్ ఫోన్ సేవలపై కట్టడి చేశారు. దీంతో పాటు ఒక ప్రాంతంలో ఎక్కువగా గుంపులుగా చేరవద్దని, వాట్సప్ సేవలు నిలుపుదల వంటి ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.