Cryptocurrency Fraud: క్రిప్టో కరెన్సీ మోసం కేసు – హీరోయిన్లు కాజల్, తమన్నాలను విచారించనున్న పోలీసులు

Cryptocurrency Fraud Case: హీరోయిన్లు తమన్నా, కాజల్ అగర్వాల్‌లు అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. కోట్ల రూపాయల స్కాంలో వారిని పోలీసులు విచారించనున్నట్టు తెలుస్తోంది. పుదుచ్చెరిలో క్రిప్టో కరెన్సీ పేరుతో కోట్ల రూపాయల మోసం జరిగింది. 2022లో కోయంబత్తూర్ ప్రధాన కేంద్రంగా క్రిప్టో కరెన్సీ పేరుతో ఓ కంపెనీ ప్రారంభించారు. దీని ప్రారంభోత్సవానికి తమన్నాతో పాటు పలువురు సెలబ్రిటీలు మాజరయ్యారు.
అనంతరం మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్‌లో జరిగిన ఓ సంస్థ కార్యక్రమానికి కాజల్ అగర్వాల్ హాజరైంది. ఆ తర్వాత ముంబైలోని క్రూయిజ్ నౌకలో పార్టీ నిర్వహించి ఇందులో పెట్టుబడులు పెట్టేలా ప్రజల్ని ఆకర్షిస్తూ ప్రమోషన్స్ చేశారు. ఈ క్రమంలోనే అత్యధిక లాభాలను రిటర్న్ ఇస్తామని చెప్పి క్రిప్టో కరెన్సీ సంస్థ పుదుచ్చేరిలో వేలాది మంది నుంచి రూ. 3.4 కోట్లు వసూలు చేశారు. ఈ వ్యవహారంలో నితీష్ జైన్, అరవింద్ కుమార్ అనే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే అశోకన్ అనే రిటైర్డ్ ఉద్యోగి ఫిర్యాదు మేరకు పోలీసులు హీరోయిన్లు తమన్నా, కాజల్ అగర్వాల్‌ను కూడా విచారించనున్నారని తెలుస్తోంది. పుదుచ్చేరి సైబర్ క్రైం ఎస్పీ డాక్టర్ బాస్కరన్ మాట్లాడుతూ.. ఈ సంస్థపై మహరాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదైనట్టు తెలిపారు. క్రిప్టో కరెన్సీ పేరుతో సదరు సమస్థ మొత్తం రూ. 50 కోట్ల మేర మోసాలకు పాల్పడినట్టు పేర్కొన్నారు. ఈ కేసులో కోయంబత్తూరు, చెన్నై, బెంగళూరుకు చెందిన 10 మంది నిందితులు ఉన్నట్టు విచారణ వెల్లడైందని ఆయన చెప్పారు.