Oscar Academy: కమల్ హాసన్, ఆయుష్మాన్ ఖురానాకు అరుదైన గౌరవం

Kamal Haasan And Ayushman: సీనియర్ నటుడు కమల్ హాసన్, బాలీవుడ్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానాకు అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ ఇండియన్ సినిమా ప్రతిష్టను పెంచుతూ ప్రముఖ నటులు కమల్ హాసన్, ఆయుష్మాన్ ఖురానా ఆస్కార్ అకాడమీ సభ్యులుగా ఎంపికయ్యారు. ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తాజాగా విడుదల చేసిన 2025 సభ్యత్వ జాబితాలో వీరిద్దరికీ చోటు దక్కింది. ఇకపై ఆస్కార్ అవార్డుల తుది నామినేషన్ల ఎంపికలో వీరు ఓటింగ్ హక్కుతో భాగం కానున్నారు. భారతీయ సినీ రంగానికి ఇది మరింత గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా, ఈ ఇద్దరు నటుల ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వీరితో పాటు స్టార్ డైరెక్టర్ పాయల్ కపాడియా, ఫ్యాషన్ డిజైనర్ మాక్సిమా బసు కూడా అస్కార్ అకాడమీకి ఎంపికయ్యారు.
ఈ జాబితాలో మొత్తం 534 మందికి సభ్యత్వ ఆహ్వానం అందగా, అందులో 19 విభాగాలకు చెందిన నిపుణులకు చోటు దక్కింది. కొత్తగా ఆహ్వానం పొందిన వారిలో 41 శాతం మహిళలు ఉన్నారు. వచ్చే ఏడాది మార్చి 15న ఆస్కార్ అవార్డు వేడుక జరగనుండగా, జనవరి 12 నుంచి 16 వరకు నామినేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు. వాటి పరిశీలన అనంతరం తుది నామినేషన్ జాబితాను జనవరి 22న ప్రకటించనున్నారు. ఆస్కార్ అకాడమీ ఎంపిక కావడంపై వీరిని పలువురు అభినందిస్తున్నారు.