Bengaluru Court: బెంగళూరు కోర్టులో కమల్ హాసన్ కు ఎదురుదెబ్బ

Kamal Haasan: స్టార్ యాక్టర్ కమల్ హాసన్ కు బెంగళూరులోని సివిల్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇకపై కన్నడ భాష లేదా సంస్కృతిపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా అయన్ని నిరోధిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కాగా గత నెలలో థగ్ లైఫ్ మూవీ ప్రమోషన్ సందర్భంగా కమల్ హాసన్ కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది అని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
దీనిపై కన్నడ సంఘాలు, సాంస్కృతిక సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. అందుకు కమల్ హాసన్ ఒప్పుకోకపోవడంతో వివాదం మరింత పెరిగిపోయింది. దీని కారణంగా థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో విడుదల చేయలేదు. అయినప్పటికీ మూవీ ప్రొడ్యూసర్స్, కమల్ హాసన్ హైకోర్టును ఆశ్రయించారు.
తాజాగా కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు మహేష్ వూరాలా దాఖలు చేసిన పిటిషన్ పై బెంగళూరు అడిషనల్ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి మధు ఎన్. ఆర్. నిన్న విచారణ జరిపారు. తాజాగా కేసుపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. కమల్ హాసన్ కన్నడ భాషపై భాషా ఆధిపత్యాన్ని చూపించేలా లేదా కన్నడ భాష, సాహిత్యం, భూమిక, సంస్కృతికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు, వ్యాఖ్యలు చేయకుండా ఆంక్షలు విధించింది. ఈ మేరకు కమల్ హాసన్ కు సమన్లు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను ఆగస్టు 30కి వాయిదా వేసింది. ఆ రోజున కమల్ హాసన్ స్వయంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.