Virender Sehwag: అప్పుడు సచిన్ కోసం గెలిచాం.. ఈసారి కోహ్లీ కోసం ప్రపంచకప్ గెలవండి
Virender Sehwag: వన్డే ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుందన్న సంగతి తెలిసిందే. దానితో పలువురు మాజీ క్రికెటర్లు ఈ సారి ఎవరు వరల్డ్ కప్ గెలుస్తారు అనే దాన్ని అంచనా వేస్తున్నారు.
Virender Sehwag: వన్డే ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుందన్న సంగతి తెలిసిందే. దానితో పలువురు మాజీ క్రికెటర్లు ఈ సారి ఎవరు వరల్డ్ కప్ గెలుస్తారు అనే దాన్ని అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో భారత మాజీ స్టార్ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో తాము సచిన్ టెండూల్కర్ కోసం ప్రపంచకప్ గెలిచినట్లుగానే ఇప్పుడు విరాట్ కోహ్లి కోసం ఖచ్చితంగా టీమ్ఇండియా ఈ సారి వరల్డ్ కప్‌ను సాధించాలన్నాడు.
2011 వన్డే ప్రపంచ కప్ సచిన్ టెండూల్కర్‌కు ఆఖరిది. అప్పుడు ధోనీ సారథ్యంలో తమ టీమ్ అంతా కలిసి వరల్డ్ కప్ కొట్టి టెండూల్కర్ కు గిఫ్ట్ ఇచ్చామని పేర్కొన్నారు. ఇప్పుడు ఇదే తరహాలో రోహిత్ శర్మ, కోహ్లిలకు ఇదే చివరి వన్డే ప్రపంచకప్ అన్న సంగతి గుర్తుంచుకోవాలని టీమిండియా ప్రస్తుత ప్లేయర్లకు ఆయన గుర్తుచేశారు. అలాగే ప్రతి ఒక్కరూ ఇప్పుడు విరాట్‌కు బహుమతిగా ప్రపంచకప్ అందించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సెహ్వాగ్ తెలిపాడు.
కోహ్లీ పరుగుల వరద(Virender Sehwag)
మైదానంలో అడుగుపెట్టిన ప్రతీసారి తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే కోహ్లీ ప్రయత్నిస్తాడని.. ఈ సారి వరల్డ్ కప్ ఆడే మైదానాల్లోని పిచ్‌ల గురించి అతడికి మంచి అవగాహన ఉందని సెహ్వాగ్ తెలిపారు. దీనితో అతడు ఈ సారి పరుగుల వరద పారిస్తాడని భావిస్తున్నానంటూ సెహ్వాగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అలాగే ట్రోఫీని ముద్దాడేందుకు అతడు తన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాడని సెహ్వాగ్ చెప్పాడు. ట్రోఫీని అందుకుంటే అతడికి ఇది ఒక గొప్ప వీడ్కోలు అవుతుందని అన్నారు.
కాగా.. 2011 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో విరాట్ కోహ్లి సభ్యుడు అన్న సంగతి తెలిసిందే. శ్రీలంకతో జరిగిన నాటి ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ 35 పరుగులు చేశాడు. 1983లో కపిల్ దేవ్ సారధ్యంలో భారత్ మొట్టమొదటి సారిగా ప్రపంచకప్ అందుకున్న భారత్ దాదాపు 28 తర్వాత 2011లో మరోసారి ప్రపంచ కప్ ను ముద్దాడిందన్న సంగతి తెలిసిందే. ఈ సారి స్వదేశంలో ప్రపంచకప్ జరగనుండడంతో భారత్ విజేతగా నిలపాలని ప్రతిఒక్క భారత క్రికెట్ అభిమాని కోరుకుంటున్నారు.